Karnataka: కర్ణాటక రాజకీయాల్లో ‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ నినాదాల రచ్చ నడుస్తోంది. నిన్న రాజ్యసభ ఎన్నికల్లో విజయం తర్వాత కాంగ్రెస్ నేత నసీర్ హుస్సేన్ మద్దతుదారులు పాక్ అనుకూల నినాదాలు చేశారు. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ వివాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ.. ఇది నిజమని తేలితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బీజేపీ కావాలనే ఇలాంటి కుట్రలకు తెరతీస్తోందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. బీజేపీ ఆరోపణల్ని కొట్టిపారేశారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేత పాకిస్తాన్ అనుకూల వ్యాఖ్యలు చేయడం మరోసారి వివాదాస్పదమైంది. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్సీ హరిప్రసాద్ మాట్లాడుతూ.. బీజేపీకి పాకిస్తాన్ శత్రుదేశం కావచ్చని, కాంగ్రెస్‌కి మాత్రం పొరుగు దేశమని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్ దేశ వ్యతిరేక సెంటిమెంట్లను కలిగిస్తోందని ఆరోపించింది. పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారంటూ బీజేపీ ఆరోపణలపై హరిప్రసాద్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Anchor Geetha : స్టేజ్ పైనే రచ్చ రవికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన యాంకర్..
‘‘ వారికి పాకిస్తాన్ శత్రుదేశం. మనకు పాకిస్తాన్ శత్రు దేశంకాదు. అది మన పొరుగు దేశం. బీజేపీ పాకిస్తాన్ శత్రు దేశంగా భావిస్తోందని, ఇటీవల బీజేపీ ఎల్‌కే అద్వానీకి భారతరత్న అవార్డు ఇచ్చిందని, ఆయన లాహోర్ వెళ్లి జిన్నా సమాధి వద్ద, ఆయన లాంటి సెక్యులర్ నాయకుడు లేరని చెప్పారు. అప్పుడు పాకిస్తాన్ శత్రుదేశంగా కనిపించలేదా..?’’ అంటూ హరిప్రసాద్ శాసనమండలిలో అన్నారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. నాలుగు సార్లు భారత్‌పై యుద్ధం చేసినా పాకిస్తాన్‌ని కాంగ్రెస్ శత్రుదేశంగా చూడటం లేదని, ఆ పార్టీ దేశవ్యతిరేక భావాలను కలిగి ఉందని విమర్శించింది. పాకిస్తాన్ పట్ల కాంగ్రెస్ వైఖరిని హరిప్రసాద్ వ్యాఖ్యలు స్పష్టం చేశాయని, జవహర్ లాల్ నెహ్రూ-మహ్మద్ అలీ జిన్నా మధ్య సాన్నిహిత్యం నేటికి కొనసాగుతోందని కర్ణాటక కాంగ్రెస్ స్పష్టం చేసిందని కర్ణాటక బీజేపీ ఎక్స్ వేదికగా ఆరోపించింది. అసెంబ్లీ పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వారికి అండగా నిలవడమే కాకుండా, భారత్‌పై నాలుగు సార్లు యుద్ధం చేసిన పాకిస్తాన్‌ని శత్రుదేశంగా పేర్కొనకపోవడం కాంగ్రెస్ మైండ్‌సెట్‌ని తెలియజేస్తోందని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
