Indian Air Force: పాక్ బోర్డర్‌లో గర్జనకు సిద్ధమౌతున్న భారత వాయుసేన.. బిగ్ వార్ ప్రిపరేషన్‌కి రెడీ!

  • సెప్టెంబర్ 21 నుంచి ఆకాశంలో యుద్ధ సన్నాహాలు
  • ఆకాశ మార్గాలు బంద్
Iaf

Iaf

Indian Air Force: భారత వైమానిక దళం పశ్చిమ రాజస్థాన్‌లో భారీ వైమానిక పోరాట విన్యాసాలకు సిద్ధమవుతోంది. కొత్తగా జారీ చేసిన NOTAM (Notice to Airmen) ప్రకారం.. జైసల్మేర్, ఫలోడి, బికనీర్, జోధ్‌పూర్ ప్రాంతాలకు సమీపంలోని భారీ గగనతలాన్ని సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 7 వరకు ప్రత్యేక కార్యకలాపాల కోసం రిజర్వ్ చేసినట్లు వెల్లడించారు. ఇందులోని కొన్ని ప్రాంతాలు అంతర్జాతీయ సరిహద్దుకు సుమారు 20 కిలోమీటర్ల వరకు విస్తరించినట్లు సమాచారం. ఈ విన్యాసాల్లో యుద్ధ విమానాలు సుమారు 40,000 అడుగుల ఎత్తు వరకు కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. రోజంతా పలు దశల్లో వైమానిక శిక్షణ కొనసాగనుందని తెలిపారు. గతంలో నిర్వహించిన విన్యాసాలతో పోలిస్తే ఈసారి కేటాయించిన గగనతల ప్రాంతం విస్తృతంగా ఉండటంతో పాటు.. కార్యకలాపాల వ్యవధి కూడా ఎక్కువగా ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదిలా ఉండగా సెప్టెంబర్ 9 నుంచి 21 వరకు జోధ్‌పూర్ వైమానిక స్థావరంలో భారత్ – జపాన్ సంయుక్త వైమానిక విన్యాసాలు ‘వీర్ గార్డియన్ 26’ జరగనున్నాయి. జపాన్ ఎయిర్ సెల్ఫ్ – డిఫెన్స్ ఫోర్స్‌కు చెందిన మూడు F-2A యుద్ధ విమానాలతో పాటు సుమారు 110 మంది సిబ్బంది ఇందులో పాల్గొననున్నారు. జపాన్‌కు చెందిన F-2A యుద్ధ విమానాలు భారతీయ వైమానిక స్థావరం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తూ గగనతల పోరాట శిక్షణలో పాల్గొనడం ఇదే తొలిసారి అని సమాచారం. జోధ్‌పూర్, దాని పరిసర ప్రాంతాలు ఈ సంయుక్త విన్యాసాలకు ప్రధాన కేంద్రాలుగా ఉండనున్నాయి. మరోవైపు వీర్ గార్డియన్ ముగిసిన వెంటనే ‘తరంగ్ శక్తి 2026’ బహుళజాతి వైమానిక విన్యాసాలు ప్రారంభం కానున్నాయని అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 12 వరకు జోధ్‌పూర్‌లో జరగనున్న ఈ విన్యాసాల్లో పలు దేశాల వైమానిక దళాలు పాల్గొనే అవకాశం ఉంది. సంక్లిష్టమైన బహుళజాతి వైమానిక కార్యకలాపాలు, పరస్పర సమన్వయం, సంయుక్త ఆపరేషన్ల సామర్థ్యాల పెంపుపై ప్రధానంగా దృష్టి సారించనున్నారని తెలుస్తోంది.

పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఈ కార్యకలాపాలు జరగడం వల్ల వీటికి వ్యూహాత్మక ప్రాధాన్యత పెరిగింది. అయితే ఇవి సాధారణ సైనిక శిక్షణ, సంసిద్ధతలో భాగంగానే నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. వాస్తవిక పరిస్థితులను తలపించే ఈ విన్యాసాల్లో వైమానిక దళం తన పోరాట సామర్థ్యాలను పరీక్షించుకోవడంతో పాటు.. వేగవంతమైన నిర్ణయాలు, సమన్వయం, ఆపరేషనల్ రెడీనెస్‌ను మెరుగుపరుచుకోనుంది. విన్యాసాల సందర్భంగా రిజర్వ్ చేసిన గగనతలంలో పౌర విమానాల రాకపోకలకు పరిమితులు విధించే అవకాశం ఉంది. దీంతో వాణిజ్య విమానాల భద్రత, గగనతల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. 2025 నుంచి భారత్, పాకిస్థాన్ మధ్య అమల్లో ఉన్న పరస్పర విమాన ఆంక్షల నేపథ్యంలో పశ్చిమ సరిహద్దు ప్రాంతాల్లో వైమానిక కార్యకలాపాలను మరింత నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. మొత్తంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జోధ్‌పూర్, పశ్చిమ రాజస్థాన్ ప్రాంతాలు వరుసగా జరిగే కీలక వైమానిక కార్యకలాపాలకు కేంద్రంగా మారనున్నాయి. భారత్ – జపాన్ సంయుక్త విన్యాసాలు, బహుళజాతి తరంగ్ శక్తి 2026, దేశీయ వైమానిక పోరాట విన్యాసాలు వరుసగా జరగడం భారత వైమానిక దళం శిక్షణ, సంసిద్ధతకు ప్రాధాన్యత ఇస్తున్న తీరును సూచిస్తోందని రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి.