Site icon NTV Telugu

India Pak War: యుద్ధం వస్తే 4 రోజుల్లోపే పాకిస్తాన్ పని ఖతం.. ఆ దేశంపై ఉక్రెయిన్ ఎఫెక్ట్..

Pakistan

Pakistan

India Pak War: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాక్ నేతలు భారత్‌ ఏ చర్య తీసుకున్నా, తమ ఆర్మీ ధీటైన జవాబు ఇస్తుందని బీరాలు పలుకుతున్నారు. తమ వద్ద అణ్వాస్త్రాలు ఉన్నాయని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, బలహీనతల్ని కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోంది. నిజానికి భారత సైన్యం ముందు నిలబడే దమ్ము లేదని విషయాలు ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి.

పాకిస్తాన్ ఆర్మీ వద్ద ఆయుధాలైతే ఉన్నాయి, కానీ వీటిలో ఉపయోగించే ‘‘మందుగుండు’’ సామాగ్రి కొరత తీవ్రంగా ఉంది. ఒక వేళ యుద్ధమే వస్తే కేవలం 4 రోజుల్లోపే పాకిస్తాన్ మందుగుండు ఖతమవుతుంది. అయితే, దీనికి కారణం ఉక్రెయిన్ యుద్ధమే అని తెలుస్తోంది. ఉక్రెయిన్ తో పాకిస్తాన్ చేసుకున్న ఆయుధ ఒప్పందాలు, దాని యుద్ధ నిల్వల్ని ఖాళీ చేశాయి. ఇదే కొరతకు కారణమని చెబుతున్నారు. సైన్యానికి మందుగుండును సరఫరా చేసే పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (POF), పెరుగుతున్న ప్రపంచ డిమాండ్, కాలం చెల్లిన సౌకర్యాల కారణంగా ఇబ్బందులు పడుతోంది. పాకిస్తాన్‌కి అవసరమయ్యేంత ఉత్పత్తి జరగడం లేదు. కేవలం 96 గంటలకు యుద్ధానికి సరిపోయే నిల్వలు మాత్రమే ప్రస్తుతం పాక్ వద్ద ఉన్నాయి.

Read Also: Pahalgam terror attack: ప్రధాని మోడీతో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా భేటీ..

పాకిస్తాన్ సైన్యం ఎక్కువగా ఆర్టిలరీ, సాయుధ యూనిట్లపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం పాక్ వద్ద M109 హోవిట్జర్లకు తగినంత 155mm షెల్స్ లేవు. BM-21 సిస్టమ్స్‌కి అవసరమయ్యే 122mm రాకెట్లు లేవు. ఇవి లేకుండా భారత్ ముందు నిలవడం అసాధ్యం. ఏప్రిల్ 2025లోని ఒక ఎక్స్ పోస్టులో పాకిస్తాన్ వద్ద ఉన్న కీలకమైన 155mm ఫిరంగి షెల్‌లను ఉక్రెయిన్‌కు మళ్లించారని, నిల్వలు ప్రమాదకరంగా తక్కువగా ఉన్నాయని పేర్కొంది.

కీలకమైన మందుగుండు సామాగ్రి లేకపోవడం వల్ల పాకిస్తాన్ సైనిక అధికారుల్లో భయం నెలకొంది. 2025 మే 02న జరిగిన స్పెషల్ కార్ప్స్ కమాండర్ల సమావేశంలో కూడా ఇదే అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో మాజీ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావెద్ బజ్వా కూడా దీనిని అంగీకరించాడు. పాక్ సైన్యం, భారత్‌తో దీర్ఘకాలిక యుద్ధంలో పాల్గొనలేదని, పాక్ వద్ద మందుగుండు సామాగ్రి, ఆర్థిక బలం లేదని చెప్పారు. మరోవైపు, పాక్ ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న అప్పులు, ద్రవ్యోల్బణం, క్షీణిస్తున్న విదేశీ మారక నిల్వలు కూడా సైన్యాన్ని ప్రభావితం చేశాయి.

Exit mobile version