SCO Foreign Ministers Meeting: గోవాలో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చే నెలలో తమ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ భారత్‌కు వస్తారని పాకిస్థాన్ గురువారం ప్రకటించింది. వచ్చే నెలలో 4-5 తేదీల్లో గోవా వేదికగా ఈ సమావేశం జరగబోతోంంది. దీనికి పాకిస్తాన్ తరుపును ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో నేతృత్వంలో ప్రతినిధి బృందం భారత్ రానుంది. దాదాపుగా తొమ్మిదేళ్ల అనంతరం ఓ పాకిస్తాన్ నాయకుడు భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి. చివరిసారిగా 2014లో నవాజ్ షరీఫ్ భారత్ లో పర్యటించారు.
Read Also: Amritpal Singh’s wife: అమృత్‌పాల్ సింగ్ భార్యపై ప్రశ్నల వర్షం
ప్రస్తుతం ఎస్‌సిఓ ఆర్గనైజేషన్ కు ఈ ఏడాది భారత్ అధ్యక్షత వహిస్తోంది. భారత్ జనవరి నెలలో చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ తో పాటు పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీకి ఆహ్వానం పంపింది. 2019లో జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ బాలాకోట్ లోని ఉగ్ర శిబిరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసింది. దీని తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆగస్టు 2019లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాని విభజించి, ఆర్టికల్ 370ని ఎత్తేసింది భారత్. దీని తర్వాత పాక్ భారత్ తో అన్ని సంబంధాలను తెగదెంపులు చేసుకుంది.
భారత్ 2017లో షాంఘై సహకార సంస్థలో సభ్యుడిగా చేరింది. భారత్ తో పాటు చైనా, కజకిస్తాన్, కర్గిజిస్తాన్, రష్యా, పాకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్, బెలారస్, ఇరాన్, మంగోలియా పరిశీలక దేశాలుగా, అర్మేనియా, అజర్‌బైజాన్, కంబోడియా, నేపాల్, శ్రీలంక మరియు టర్కీ డైలాగ్ పార్ట్నర్స్ గా ఉన్నాయి. ఆర్థిక, రాజకీయ, సైనిక సహకారాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో రెండు దశాబ్దాల క్రితం ఎస్ సీ ఓ ఏర్పడింది. ఇది ప్రపంచ మొత్తం జనాభాలో 42 శాతం, ప్రపంచ జీడీపీలో 25 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.