Osamu Suzuki: జపనీస్ ఆటోమొబైల్స్ దిగ్గజం సుజుకి మోటార్ ఛైర్మన్, సీఈఓ ఒసాము సుజుకి(94) కన్నుమూశారు. ప్రాణాంతక లింఫోమాతో పోరాడుతూ డిసెంబర్ 25న తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు తోషిహిరో సుజుకి తెలిపారు. ఆయన మరణం పట్ల ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఇసాము సుజుకి 1930 జనవరి 30న ఓ జపనీస్ వ్యవసాయ కుటుంబంలో 4వ సంతానంగా జన్మించారు. మొదట్లో రాజకీయ నాయకుడు కావాలని ఆశించిన సుజుకీ, ఆ తర్వాత ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సుజుకీ మోటార్స్‌కి ఎక్కువ కాలం బాస్‌గా పనిచేశారు. టోక్యోలని చువో యూనివర్సిటీ నుంచి డిగ్రీ చదవిని ఆయన జూనియర్ హైస్కూల్ టీచర్‌గా, నైట్ గార్డ్‌గా పార్ట్ టైమ్ జామ్ కూడా చేశారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత బ్యాంక్‌లో పని చేశారు.
షోకో సుజుకితో వివాహం ఆయన జీవితాన్ని గొప్పమలుపు తిప్పింది. షోకో సుజుకి సుజికీ మోటార్స్ అధినేతకు మనవరాలు. ఆయనకు మగవారసులు లేకపోవడంతో, జపనీస్ ఆచారం ప్రకారం.. ఒసాము సుజుకి తన భార్య ఇంటి పేరును తీసుకుని ఆటోమొబైల్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. 40 ఏళ్ల పాటు సుజుకి మోటార్స్ కంపెనీని నడిపించారు. 28 ఏళ్ల పాటు కంపెనీ ఛైర్మన్‌గా పనిచేశారు. 2015లో బాధ్యతల్ని తన కొడుకు తోహిహిరోకి అప్పగించినప్పటికీ, కంపెనీకి ఛైర్మన్, సీఈవోగా కొనసాగారు.
భారత ఆటోమొబైల్స్ రంగానికి ఓ వెలుగునిచ్చాడు
లైసెస్సు పాలన, క్లోజ్డ్ ఎకానమిగా భారత్ ఉన్న సమయంలోనే, భారత్‌లో ఆటోమొబైల్ రంగం విస్తరిస్తుందని ఊహించిన ఒసాము సుజుకీ 1981లో దేశంలోకి అడుగుపెట్టారు. ఆ ఏడాది మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్ పేరుతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశారు. దేశంలో ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ పెరగడానికి కారణమయ్యారు. మారుతీ ఉద్యోగ లిమిటెడ్ తర్వాత మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్‌గా మారింది. సుజుకీ మోటార్ కార్పొరేషన్‌లో మెజారిటీ వాటా ఉన్న ప్రభుత్వం 2007లో దాని నుంచి బయటకు వచ్చింది. మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్‌కు ఒసాము సుజుకి డైరెక్టర్ మరియు గౌరవ ఛైర్మన్‌గా ఉన్నారు.
భారత ఆర్థిక వ్యవస్థ, భారత్-జపాన్ బంధానికి వారధిగా నిలిచిన ఒసాముకి భారత ప్రభుత్వం ‘‘పద్మభూషణ్’’తో సత్కరించింది. దేశంలో ఇప్పటికీ ఐకానిక్ కారుగా ఉన్న మారుతి 800ని పరిచయం చేయడంలో ఒసాము సుజుకి పాత్ర ఉంది. ఈ కారు దేశంలో కార్ మార్కెట్ విస్తరణకు ఉత్ప్రేరకంగా పనిచేసింది.