అల్ ఖైదా ఉగ్రవాది.. అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చివేతలో ప్రధాన సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ తెలియని వారుండరు. అమెరికా దశాబ్ధకాలం పాటు వెటాడి వెంటాడి పాకిస్తాన్ లోని అబోటాబాద్ లో హతమార్చింది. ఇదిలా ఉంటే ఓ ప్రభుత్వ అధికారి తన కార్యాలయంలో ఏకంగా ఒసామా బిన్ లాడెన్ ఫోటోను పెట్టుకుని దాని కింద ‘‘ప్రపంచపు అత్యుత్తమ జూనియర్ ఇంజనీర్’’గా అభివర్ణిస్తూ ఫోటో పెట్టాడు. ఇది ఎక్కడో పాకిస్తానో, ఆఫ్ఘనిస్తానో కాదు మన భారత్ లో యూపీలో ఓ విద్యుత్ అధికారి నిర్వాకం. ఈ విషయం వైరల్ కావడంతో సదరు అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ లోని దక్షిణాంచల్ విద్యుత్ విత్రన్ నిగమ్ లిమిటెడ్ లో పనిచేసే సబ్- డివిజనల్ ఆఫీసర్ రవీంద్ర ప్రకాష్ గౌతమ్ కార్యాలయంలో ఒసామా బిన్ లాడెన్ ఫోటోను పెట్టుకుని.. దాని కింద ‘‘గౌరవనీయమైన ఒసామా బిన్ లాడెన్, ప్రపంచంలోని అత్యుత్తమ జూనియర్ ఇంజనీర్’’ అని రాసి ఉంది. ఈ విషయం ఉన్నతాధికారుల చెవిలో పడటంతో రవీంద్ర ప్రకాష్ గౌతమ్ ను సస్పెండ్ చేశారు. కార్యాలయం నుంచి ఫోటోను తొలగించారు. ఈ పనికి పాల్పడ్డ గౌతమ్ ను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ సంజయ్ కుమార్ సింగ్ తెలిపారు.
సస్పెండ్ అయిన తర్వాత కూడా రవీంద్ర ప్రకాష్ గౌతమ్ తగ్గలేదు. తన చర్యలను సమర్థించుకున్నాడు. ఫోటో ఎవరిదైనా కావచ్చు..ఒసామా ప్రపంచంలోనే అత్యుత్తమ జూనియర్ ఇంజనీర్ అని చెప్పుకొచ్చాడు. నా దగ్గర అనేక కాపీలు ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేశాడు.