తరుచూ మనం అవయవదానం గొప్పతనం గురించి చెబుతుంటాం. అవయవాలను దానం చేయడం వల్ల మరికొంత మందికి పునర్జన్మ ప్రసాదించే అవకాశం ఉంటుంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే.. అవయవదానం గొప్పతనం తెలిసేలా చేసింది. పూణేలో ఓ యువతి అవయవదానం చేయడం వల్ల మరో ఐదుగురికి పునర్జన్మ లభించింది. ఇందులో ఇద్దరు ఆర్మీ సైనికులు కూడా ఉన్నారు. వివరాల్లోకి వెళితే పూణేకు చెందిన ఓ యువతి ఇటీవల ఓ ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయింది. ప్రమాదానికి గురైన యువతని పూణేలోని కమాండ్ హాస్పిటల్ సదరన్ కమాండ్ కు తీసుకువచ్చే సమయానికే ఆమె బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో వైద్యులు కుటుంబ సభ్యులను సంప్రదించి.. అవయవదానానికి ఒప్పించారు.
Read Also: Rajanna Sirisilla: విషాదం.. 140 ఆవులు మృతి..! మరో 89 అదృశ్యం..?
యువతి కుటుంబీకుల అంగీకారంతో కమాండ్ హస్పిటల్ లోని ట్రాన్స్ ప్లాంట్ టీమ్, జోనల్ ట్రాన్స్ ప్లాంట్ కోఆర్డినేషన్ సెంటర్, ఆర్మీ ఆర్గాన్ రిట్రీవల్ అండ్ ట్రాన్స్ ప్లాంట్ అథారిటీ వెంటనే ఆర్గాన్ డోనేషన్ కోసం అలర్ట్ అయ్యాయి. జూలై 14,15 తేదీల్లో కిడ్నీలు అవసరమున్న ఇద్దరు ఇండియన్ ఆర్మీ సైనికులుకు మార్పిడి చేశారు. పూణేలోని రూబీ హాల్ క్లినిక్ లో ఓ రోగికి కాలేయం ట్రాన్స్ ప్లాంట్ చేశారు. మరో ఇద్దరికి కళ్లను దానం చేశారు. దీంతో తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులకు పునర్జన్మ, కంటి చూపును అందించింది ఆ యువతి. చనిపోయి కూడా మరో ఐదుగురిని బతికించింది.