Operation Sindoor: పాకిస్తాన్‌తో యుద్ధంలో భారత్‌కు కష్టకాలం.. సిందూర్‌పై కాంగ్రెస్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

  • ఆపరేషన్ సిందూర్‌పై హిమాచల్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
  • పాకిస్తాన్‌తో వ్యవహరించడం భారత్‌కు కష్టమైందని కామెంట్స్..
  • కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం..
Jagat Singh Negi

Jagat Singh Negi

Operation Sindoor:  ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌తో వ్యవహరించడంలో భారత్ కష్టకాలాన్ని ఎదుర్కొందని హిమాచల్ ప్రదేశ్ మంత్రి జగత్ సింగ్ నేగి వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది. అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. భారత సాయుధ దళాలను అవమానించేలా మంత్రి మాట్లాడారని బీజేపీ నేతలు మండిపడ్డారు.

ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన డసాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని మంత్రి ఆరోపించారు. ఒక్కో రాఫెల్ యుద్ధ విమానానికి రూ. 700 కోట్లు చెల్లించాల్సి ఉండగా, భారత్ రూ. 2300 కోట్లు చెల్లించిందని ఆరోపించారు. పాకిస్తాన్‌తో యుద్ధంలో ఇవి ఉపయోగపడలేదని, ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌తో వ్యవహరించడం భారత్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని , క్షమాపణలు చెప్పేది లేదని ఆయన అన్నారు.

అయితే, మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మంత్రి వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. మరో మంత్రి విక్రమాదిత్య సింగ్ దీనిపై పెద్దగా స్పందించకుండా ‘‘వాస్తవాలు అందరికీ తెలుసు’’ అని అన్నారు. మంత్రి వ్యాఖ్యలకు బీజేపీ అసెంబ్లీ వెలుపల నిరసన చేపట్టింది. బీజేపీ నేతలు మాట్లాడుతూ.. మంత్రికి ఇలాంటి పాక్ అనుకూల అభిప్రాయాలు ఉంటే ఆయన లాహోర్ వెళ్లిపోవాలని వ్యాఖ్యానించారు.