Operation Sindoor: పహల్గాం ఉగ్రవాద ఘటన తర్వాత, భారత్ పాకిస్తాన్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’తో విరుచుకుపడింది. పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించింది. ఇందులో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ హెడ్‌క్వార్టర్స్ అయిని మురిడ్కే, బహవల్‌పూర్ కూడా ఉన్నాయి. 100 మందికిపైగా టెర్రరిస్టులు ఈ దాడుల్లో హతమయ్యారు. అయితే, ఈ దాడుల తర్వాత పాకిస్తాన్ సైన్యం భారత్‌పైకి దాడులు ప్రారంభించింది. ఈ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది.
పాకిస్తాన్ కవ్వింపులకు సమాధానంగా భారత్, పాకిస్తాన్‌లోని 11 వైమానిక స్థావరాలను క్షిపణులతో ధ్వంసం చేసింది. ముఖ్యంగా, పాక్ సైన్యం ప్రధాన కార్యాలయంలో ఉండే రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌ని భారత్ అటాక్ చేసింది. నూర్ ఖాన్‌తో పాటు సర్గోదా, రహియ్ యార్ ఖాన్, రఫీకీ, చక్లాలా, సుక్కూర్, సియాల్ కోట్ వంటి ఎయిర్ బేస్‌లు భారత దాడుల్లో ధ్వంసమయ్యాయి.
Read Also: AK-203 Rifle: భారత్ కా ‘షేర్’ AK-203.. నిమిషానికి 700 బుల్లెట్లు, 800 మీటర్ల రేంజ్..
అయితే, ఇప్పుడు పాకిస్తాన్ ధ్వంసమైన వైమానిక స్థావరాలను గత రెండు నెలల నుంచి పునరుద్ధరిస్తూనే ఉంది. ముఖ్యంగా, దెబ్బతిన్న రన్‌వేలను రిపేర్ చేస్తోంది. ఇదే కాకుండా కీలకమైన మిలిటరీ ఇన్‌స్టాలేషన్లను మళ్లీ నిర్మించే పనిలో ఉంది. తాజాగా, రహీమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్ రన్‌వేని మూసివేతను మూడోసారి పొడగించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఈ ఎయిర్ బేస్ రన్‌వేను భారత్ ధ్వంసం చేసింది. రన్‌వేపై పెద్ద గుంత ఏర్పడింది.
రన్‌వే పునరుద్ధరణ కోసం పాకిస్తాన్ తాజాగా ‘‘నోటమ్’’ జారీ చేసింది. ఆగస్టు 5 వరకు రన్‌వే కార్యకలాపాలు మూసివేస్తున్నట్లు పేర్కొంది. అయితే, ఎలాంటి కారణం పేర్కొనకుండా నోటమ్ జారీ చేసినట్లు తెలుస్తోంది. మే 10 తర్వాత భారత్ దాడి చేయడం వల్ల తొలిసారి నోటమ్ జారీ చేసింది. అప్పటి వరకు విమాన కార్యకలాపాలకు అందుబాటులో ఉండదని పేర్కొంది. పంజాబ్ ప్రావిన్సులో ఉన్న ఈ రహీమ్ యార్ ఖాన్ ఇటు పాక్ మిలిటరీ, అటు పౌర విమాన సేవలు అందించే షేక్ జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కలిగి ఉంది.