Site icon NTV Telugu

Durgapur Gang Rape: బెంగాల్‌లో మాకు రక్షణ లేదు, ఒడిశా వెళ్తాం: గ్యాంగ్ రేప్ బాధితురాలి తండ్రి..

Gang Rape

Gang Rape

Durgapur Gang Rape: పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం సంచలనంగా మారింది. ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో రెండో ఏడాది మెడిసిన్ చదువుతున్న విద్యార్థిని, శుక్రవారం రాత్రి క్యాంపస్ బయటకు రాగా, కొంత మంది నిందితులు ఆమెను క్యాంపస్‌కు సమీపంలోని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బెంగాల్‌లోని మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ సర్కార్‌పై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ఇదిలా ఉంటే, బాధితురాలి తండ్రి తన కూతురు పడుతున్న వేధన గురించి కన్నీటి పర్యంతమవుతున్నారు. తమకు బెంగాల్‌లో రక్షణ లేదని, ఒడిశా వెళ్లిపోతామని, బెంగాల్‌లో తన కూతురు భద్రత గురించి ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. ‘‘నా కుమార్తె నొప్పితో బాధపడుతోంది. ఆమె ప్రస్తుతం నడవలేకపోతోంది. ఆమె మంచం పట్టింది. ఇక్కడ ఆమె భద్రత గురించి నేను ఆందోళన చెందుతున్నాను. వారు ఆమెను ఇక్కడ ఏ క్షణంలోనైనా చంపవచ్చు. అందుకే మేము ఆమెను ఒడిశాకు తిరిగి తీసుకెళ్లాలనుకుంటున్నాము. నమ్మకం పోయింది. ఆమె బెంగాల్‌లో ఉండటం మాకు ఇష్టం లేదు. ఆమె ఒడిశాలో తన చదువును కొనసాగిస్తుంది’’ అని ఏఎన్ఐతో చెప్పారు.

Read Also: Mamata Banerjee: “అమ్మాయిలు రాత్రి బయటకు రాకూడదు”.. గ్యాంగ్‌రేప్‌పై మమత వివాదం..

ఒడిశాలోని జలేశ్వర్‌కు చెందిన 23 ఏళ్ల యువతి దుర్గాపూర్‌లో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతోంది. శుక్రవారం రాత్రి తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లినప్పుడు, కొంతమంది పురుషులు బలవంతంగా ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంఘీ తమతో మాట్లాడారని బాధితురాలి తండ్రి చెప్పారు. ఒడిశా ప్రభుత్వం తమకు సాయం చేస్తోందని చెప్పారు. తన కుమార్తెకు ఒడిశా వైద్య కాలేజీలో అడ్మిషన్ ఇవ్వాలని అభ్యర్థించినట్లు చెప్పారు. ఈ నేరంతో సంబంధం ఉన్న అరెస్టయిన ముగ్గురిని అపు బౌరి (21), ఫిర్దోస్ సేఖ్ ​​(23), సేఖ్ ​​రియాజుద్దీన్ (31) గా గుర్తించారు. ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో డాక్టర్‌పై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఏడాది తర్వాత, కోల్‌కతాలోని లా కాలేజీలో విద్యార్థినిపై అత్యాచారం జరిగిన నెలల తర్వాత దుర్గాపూర్‌లో ఈ సంఘటన జరిగింది.

Exit mobile version