NTV Telugu Site icon

Odisha: దేశంలోనే అతిపెద్ద ఉద్యోగ మోసం గుట్టురట్టు.. నిరుద్యోగులే టార్గెట్‌గా స్కామ్..

Job Scam

Job Scam

Odisha Police Busts “India’s Biggest Ever” Job Fraud: దేశంలోనే అతిపెద్ద ఉద్యోగ మోసాన్ని గట్టురట్టు చేశారు ఒడిశా పోలీసులు. నిరుద్యోగులే టార్గెట్ గా జరుగుతున్న స్కామ్ ను వెలుగులోకి తీసుకువచ్చారు ఒడిశా పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్. ఉత్తర్ ప్రదేశ్ అలీఘర్ కేంద్రంగా ఈ స్కామ్ జరుగుతోంది. ఈ స్కామ్ వల్ల ఇప్పటి వరకు 50,000 మంది నిరుద్యోగులు మోసం పోయినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో వేలాది మంది నిరుద్యోగ యువత ఈ స్కామర్ల వలలో చిక్కుకున్నట్లు సమాచారం.

ఉత్తర్ ప్రదేశ్ అలీఘర్ కు చెందిన జాఫర్ అహ్మద్(25) ప్రాథమిక నిందితుల్లో ఒకరు. బీటెక్ చువుకున్న జాఫర్ వృత్తిరీత్యా ఇంజనీర్. ఇతడిని పోలీసులు అరెస్ట్ చేసి భువనేశ్వర్ కోర్టులో హాజరుపరిచారు. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు సహకరించారు. ఈ స్కామ్ లో మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు విచారిస్తున్నారు. నిరుద్యోగులు కోట్లలో తమ డబ్బును మోసపోయారు.

Read Also: Xi Jinping: చైనాకు కఠిన సవాళ్లు ముందున్నాయి.. భారత్ ఆంక్షల్ని విధించింది.

కొంతమంది డెవలపర్‌ల సహాయంతో యూపీకి చెందిన కేటుగాళ్లు ఈ స్కామ్ ను నడుపుతున్నారు. దీని కోసం ప్రత్యేకంగా 50 మందితో ఓ కాల్ సెంటర్ కూడా సెటప్ చేశారు. ఈ ఉద్యోగులకు నెలకు రూ.15,000 చొప్పున జీతం ఇస్తూ దందాను నడిపారు. వీరంతా జమాల్ పూర్, అలీఘర్ ప్రాంత వాసులే. 1000 పైగా సిమ్ కార్డులు, 530 హ్యాండ్ సెట్లను ఉపయోగించి స్కామ్ కు పాల్పడ్డారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఇతర పథకాల పేరుతో ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతూ నిరుద్యోగులను బుట్టలో వేసుకుంటున్నారు. ప్రభుత్వ వెబ్ సైట్ ను పోలిన మరో వెబ్ సైట్ డెవలప్ చేసి, ప్రధానంగా ఆరోగ్యం, స్కిల్ డిపార్ట్మెంట్ జాబ్స్ ఆఫర్ చేస్తూ ప్రభుత్వ ప్రకటనలను ప్రదర్శించేలా వెబ్ సైట్ రూపొందిస్తారు. నిరుద్యోగులను మోసగించేందుకు ‘‘ ప్రధాన్ మంత్రి స్కీమ్స్’’ ఉపయోగిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. కేటుగాళ్లు తమ ఫోన్లను వాడకుండా జాగ్రత్తలు తీసుకునే వారు. ట్రూ కాలర్ లో కూడా గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చే విధంగా జాగ్రత్తలు తీసుకునేవాళ్లు. ఈ స్కామ్ కోసం మొత్తం 100 బ్యాంక్ ఎకౌంట్లను వాడారు. జన్ సేవా కేంద్రం నుంచి డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు ‘‘జన్ సేవా కేంద్రాల’’ను మాత్రమే ఉపయోగించుకునే వారు.

ఈ క్రమంలో అభ్యర్థులు వీళ్ల వలలో పడిన వెంటనే రిజిస్ట్రేషన్, ఇంటర్వ్యూ శిక్షణ, ఇతర వాటి కోసం రూ. 3000- రూ.50,000 వరకు వసూలు చేస్తారు. సాధారణంగా ఉద్యోగం కోసం నమోదు చేసుకున్న వారందరిని ఎంపిక చేసేవారు. కొన్ని సందర్బాల్లో అక్రమార్కులు స్థానిక వార్తా పత్రికల్లోకూడా ప్రకటనలు ఇచ్చేవారు. ఇలా ఈ స్కామ్ లో కోట్లాది రూపాయలు కొల్లగొట్టినట్లు పోలీసులు గుర్తించారు.