మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతూనే ఉన్నాయి.. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్ల నుంచి నుపుర్‌కు నోటీసులు వెళ్తున్నాయి.. తాజాగా, కోల్‌కతా పోలీసులు షాక్ ఇచ్చారు. నార్కెల్‌దంగా పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ 153ఏ, 295ఏ, 298 మరియు 34 సెక్షన్‌ల కింద నుపుర్ శర్మపై కేసు నమోదు చేశారు కోల్‌కతా పోలీసులు.. ఇక, 41ఏ CrPC కింద జూన్ 20వ తేదీన తమ ముందు హాజరు కావాలంటూ నోటీసులు పంపారు.
Read Also: Jubilee Hills Case: అంతా నీ వల్లే.. కాదు నువ్వే కారణం.. తన్నుకున్న మైనర్లు..!
మరోవైపు, మహారాష్ట్రలోని భీవండి పోలీసులు సమన్లు పంపారు. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల కేసుకు సంబంధించి తమ ఎదుట హాజరు కావాలని నోటిసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నట్టు పోలీసులు వెల్లడించారు.. ఇదే కేసులో నవీన్ జిందాల్‌కు సైతం సమన్లు జారీ చేసినట్టు తెలిపారు.. వివాదాస్పద వ్యాఖ్యలపై ఇప్పటికే థానే పోలీసులు నోటీసులు జారీ చేశారు. జూన్ 22 విచారణకు హాజరు కావాలని ఆమెను పోలీసులు నోటీసులు ఇచ్చారు. అలాగే చర్చకు సంబంధించిన వీడియో పుటేజ్ ను తమకు అందించాలని సదరు న్యూస్ ఛానల్ కు పోలీసులు నోటీసులు పంపారు.. ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మను ఇప్పుడు కేసులు వెంటాడుతున్నాయి.
