Sharad Pawar: విపక్షాల ఐక్యత కోసం దేశంలో బీహార్ సీఎం నితీష్ కుమార్, ఎన్సీపీ నేత శరద్ పవార్ ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనే ప్రశ్న వస్తోంది. తాజాగా దీనిపై స్పందించారు శరద్ పవార్. తాను ప్రధాన మంత్రి రేసులో లేనని ప్రకటించారు. దేశాభివృద్ధికి పాటుపడే నాయకత్వాన్ని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని అన్నారు. ఇటీవల మరణించిన పూణే యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ రామ్ తకవాలే సంతాప సభలో శరద్ పవార్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలన్నీ కలిస్తే ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించడం పెద్ద విషయం కాదని అన్నారు.
Read Also: The Kerala Story: మతం మారాలని యువతిపై ఒత్తిడి.. “కేరళ స్టోరీ” చూసిన తర్వాత ఫిర్యాదు..
తాను ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చందుకు ప్రయత్నాలు చేస్తున్నానని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనని, నేను ప్రధాన మంత్రి రేసులో లేనని అన్నారు. మహా వికాస్ అఘాడిలో భాగమైన కాంగ్రెస్ మరియు శివసేన (యుబిటి)తో సీట్ల పంపకంపై పవార్ మాట్లాడుతూ.. ఇటీవల తన నివాసంలో సమావేశం జరిగిందని, ఉద్ధవ్ ఠాక్రే, సోనియా గాంధీ లేదంటే మల్లికార్జున ఖర్గే కలిసి సీట్ల పంపకంపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మహారాష్ట్రలో స్థానిక సంస్థల పదవీ కాలం 2022తో ముగిసింది. అయితే కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఎన్నికలు జరగలేదు. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు, ఆ తరువాత మహారాష్ట్ర ఎన్నికలు వరసగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్, ఉద్దవ్ ఠాక్రే శివసేన, ఎన్సీపీల మధ్య సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయి.