India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరకపోవడానికి ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో నేరుగా మాట్లాడకపోవడమే అని ఆ దేశ వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లుట్నిక్ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై భారత్ స్పందిస్తూ.. ‘‘ఇవి సరైనవి కావు’’ అని చెప్పింది. అమెరికా విధించిన టారిఫ్స్, వాణిజ్య కారణాల కన్నా ట్రంప్‌కు ఉన్న వ్యక్తిగత అసంతృప్తి కారణమని లుట్నిక్ వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మోడీ వ్యక్తిగతంగా ట్రంప్‌తో మాట్లాడి ట్రేడ్ డీల్ ముగించలేదన్న కారణంతోనే ట్రంప్ ఆగ్రహించారని, దీని ఫలితంగానే భారత్‌పై 50 శాతం సుంకాలు విధించబడ్డాయి, ఇంకా భారీ సుంకాలు ఉంటాయని అమెరికా భారత్‌ను హెచ్చరిస్తోంది.
Read Also: డాక్టర్ అవసరం లేకుండా ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు ఇవే!
అయితే, ఈ వ్యాఖ్యలు వచ్చిన కొన్ని గంటల్లోనే భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఈ వ్యాఖ్యల్ని మేం గమనించాము. భారత్, అమెరికా మధ్య గతేడాది ఫిబ్రవరిలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలు జరుగుతున్నాయి. అప్పటి నుంచి రెండు దేశాలు అనేక చర్చల్లో పాల్గొన్నాయి. సమతుల్యత, పరస్పర లాభకరమైన ఒప్పందానికి చేరువైన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చర్చల స్వభావాన్ని సరిగ్గా ప్రతిబింబిచవు’’ అని అన్నారు. రెండు దేశాల మధ్య లాభదాయకమైన ట్రేడ్ డీల్‌కు భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. చర్చల్ని తుది దశకు తీసుకెళ్లాలనే ఆసక్తి భారత్‌కు ఉందని అన్నారు. 2025లో ప్రధాని మోడీ, ట్రంప్‌లు 8 సార్లు ఫోన్‌లో మాట్లాడారని, ఈ సంభాషణల్లో ఇరు దేశాలు విస్తృత భాగస్వామ్యానికి సంబంధించి అనేక అంశాలపై చర్చించినట్లు భారత్ చెప్పింది.
దీనికి ముందు, ట్రంప్ సహాయకుడు, వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లుట్నిక్ మాట్లాడుతూ.. భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం నిలిచిపోవడానికి కారణం మోడీ ట్రంప్‌తో వ్యక్తిగతంగా ఫోన్ చేయకపోవడమే అని అన్నారు. గతేడాది చర్చలు విఫలమైన తర్వాత భారత్‌పై అమెరికా 50 శాతం సుంకాలను విధించింది. ఇందులో 25 శాతం రష్యా ఆయిల్ కొంటున్నందుకు విధించింది. మరో 25 శాతం ‘‘పరస్పర సుంకాలు’’. ట్రేడ్ డీల్ అంతా సిద్ధంగా ఉందని, మోడీ ట్రంప్‌కు ఫోన్ చేయాల్సి ఉంది, కానీ వారు అలా చేయడంలో అసౌకర్యంగా భావించారని, అందుకే మోడీ ఫోన్ చేయలేని లుట్నిక్ ఆల్ ఇన్ పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యానించారు.
