Noida Twin Tower Demolition: నోయిడా ట్విన్ టవర్స్ పేకమేడలా కూల్చివేతకు సమయం ఆసన్నమైంది. ఈ రోజు మధ్యాహ్నం 2.30 నుంచి కూల్చివేత ప్రక్రియ ప్రారంభమై దాదాపుగా 15 నిమిషాల వ్యవధిలోనే కూల్చివేత ప్రక్రియ పూర్తవుతుంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నోయిడాలోని సెక్టార్ 93ఏలో ఉన్న ట్విన్ టవర్స్ ను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆగస్టు 28న కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ ట్విన్ టవర్స్ కూల్చివేసేందుకు సెక్టార్ 93ఏ లోని ప్రజలను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు. వాహనాలు, పెంపుడు జంతువులను ఇతర ప్రాంతాలకు తరలించారు. నోయిడా ట్విన్ టవర్స్ లో అపెక్స్ టవర్ లో 32 ఫోర్లు ఉండగా.. సెయాన్ టవర్ లో 29 ఫ్లోర్లు ఉన్నాయి.
103 మీటర్ల ఎత్తున్న ఈ జంట టవర్ల కూల్చివేత కోెసం మొత్తం 3700 కిలోల పేలుడు పదార్థాలు ఉపయోగించనున్నారు. పిల్లర్లకు 7000 రంధ్రాలను చేసి పేలుడు పదార్థాలను ఏర్పాటు చేశారు. వీటన్నింటిని వైర్ల ద్వారా కనెక్ట్ చేశారు. దాదాపుగా 20,000 సర్క్యూట్ లను ఏర్పాటు చేశారు. కేవలం 9 సెకన్లలోనే 32 అంతస్తులు కుప్పకూలనున్నాయి. పేలుడు వల్ల వచ్చే దుమ్ము 12 నిమిషాల వరకు ఉంటుంది. గాలి వేగం వల్ల కొంత సమయం మారే అవకాశం ఉంది. పేలుడు పర్యవేక్షించే నిపుణులు టవర్స్ నుంచి 100 మీటర్ల దూరంలో ఉంటారు. పేలుడు సమయంలో ఆ ప్రాంతాన్ని నో ఫ్లైయింగ్ జోన్ గా ప్రకటించారు అధికారులు. పేలుడు వల్ల 55,000 టన్నుల శిథిలాలు ఏర్పడుతాయి. వీటిని 3000 ట్రక్కుల ద్వారా మూడు నెలల పాటు తరలించనున్నారు.
Read Also: Asia Cup 2022: తొలి మ్యాచ్‌లో శ్రీలంక చిత్తు.. ఆఫ్ఘనిస్తాన్ ఘనవిజయం
పేలుడు సమయంలో వచ్చే ప్రకంపనలు దాదాపుగా 30 సెకన్లు ఉంటాయి. ఈ ప్రకంపనలు రిక్టర్ స్కేల్ పై 0.4గా ఉండే భూకంపానికి సమానం. నోయిడా ప్రాంతంలో ఉండే భవనాలు రిక్టర్ స్కేల్ పై 6.0 తీవ్రతతో వచ్చే భూకంపాలను కూడా తట్టుకోగలవు. సాయంత్రం 5.30 తరువాత ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారిని అధికారులు తిరిగి అనుమతిస్తారు. ఇప్పటికే ఈ టవర్స్ లో ఉన్న పలు ఫ్లాట్లు అమ్ముడయ్యాయి. వీరందరికి వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. గతంలో ఇండియాలో 68 మీటర్ల ఎత్తు ఉన్న భవనం కూల్చివేయడమే రికార్డుగా ఉండేది. అయితే ప్రస్తుతం దీన్ని 103 మీటర్ల నోయిడా ట్విన్ టవర్స్ బ్రేక్ చేస్తోంది. ఇప్పటి వరకు అబుదాబిలో 168 మీటర్ల భవనాన్ని నేలమట్టం చేయడం రికార్డుగా ఉంది.