Site icon NTV Telugu

Bangladesh: బంగ్లా హిందూ సన్యాసి తరుపున వాదించేందుకు ముందుకురాని లాయర్లు..

Bangladesh

Bangladesh

Bangladesh: బంగ్లాదేశ్‌లో పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. అక్కడి మైనారిటీలకు న్యాయం కూడా దొరకడం లేదు. బంగ్లాదేశ్లో ప్రముఖ హిందూ సన్యాసి, హిందువుల హక్కుల కోసం పోరాడుతున్న చిన్మోయ్ కృష్ణదాస్‌ని అక్కడి అధికారులు దేశద్రోహం కేసుపై అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే, అతడి తరుపున వాదించేందుకు ఏ లాయర్ కూడా ముందుకు రావడం లేదు. రాడికల్ ఇస్లామిస్టుల బెదిరింపులతో న్యాయవాదులు భయపడుతున్నారు. ఆయన కోసం వాదిస్తున్న లాయర్‌పై అత్యంత దారుణంగా దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం అతను ప్రాణాల కోసం ఐసీయూలో పోరాడుతున్నాడు.

Read Also: Eknath Shinde: ఆందోళనకరంగా ఏక్‌నాథ్ షిండే ఆరోగ్యం.. ఆసుపత్రికి తరలింపు

చిన్మోయ్ కృష్ణదాస్ తరుపున వాదిస్తున్న న్యాయవాది రామెన్ రాయ్‌పై దాడి జరిగింది. ఆయన ఇంటిని దోచుకున్నారని ఇస్కాన్ ఇండియా సోమవారం తెలిపింది. ముస్లింలు మెజారిటీగా ఉన్న బంగ్లాదేశ్‌లో హిందువుల గొంతు నొక్కే ప్రయత్నాల్లో భాగంగా ఇస్లామిక్ రాడికల్స్ దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయితే, రాయ్‌పై దాడి తర్వాత చిన్మోయ్ తరుపున కేసు వాదించేందుకు ఏ లాయర్ ముందుకు రావడం లేదు. ఆయన బెయిల్ పొందడం మరింత ఆలస్యం అవ్వనుంది. దాస్ తరుపరి విచారణ జనవరి 2కి వాయిదా పడింది. దీంతో మరో నెల పాటు ఆయన జైలులోనే ఉండాల్సి వస్తుంది.

చిట్టగాంగ్ బార్ అసోసియేషన్‌లోని ముస్లిం లాయర్లు, దాస్ తరుపున వాదించేందుకు హాజరైన హిందూ లాయర్లను బెదిరిస్తు్న్నారు. నెల రోజుల క్రితం జరిగిన హిందూ మద్దతు ర్యాలీలో ఆయన దేశద్రోహానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో నవంబర్ 25న ఆయనను ఢాకా ఎయిర్‌పోర్టులో అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. తని బెయిల్ దరఖాస్తును చిట్టగాంగ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు నవంబర్ 26న తిరస్కరించింది. చిన్మోయ్ కృష్ణదాస్‌ని కలిసేందుకు వెళ్లిన మరో ఇద్దరు సన్యాసుల్ని కూడా పోలీసులు అకారణంగా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో హిందువుకు పెద్ద దిక్కుగా ఉన్న చిన్మోయ్‌ని అక్కడి ప్రభుత్వం సైలెంట్ చేయాలని చూస్తోంది.

Exit mobile version