Nitish Kumar: బిహార్‌లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్న బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని దెబ్బకొట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నితీష్ కుమార్ 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆయనే స్వయంగా ఉత్తరప్రదేశ్‌లోని ఫుల్‌పూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రాష్ట్రంలో తనకు నచ్చిన ఏదైనా స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నితీష్ కుమార్‌కు ఆఫర్ ఇచ్చారని.. తన పార్టీ తరపున మద్దతు ఇస్తానని హామీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఫుల్‌పూర్‌లోని జనతాదళ్ (యునైటెడ్)కి చెందిన పలువురు కార్యకర్తలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నితీష్‌కుమార్‌ను డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
జనతాదళ్ (యునైటెడ్) జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్ ఆదివారం కూడా నితీష్ కుమార్ ఉత్తరప్రదేశ్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని సూచించారు. ఎందుకంటే ఆయనకు ఫుల్‌పూర్ నుండి మాత్రమే కాకుండా అంబేడ్కర్ నగర్, మీర్జాపూర్ లోక్‌సభ స్థానం నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. “అంగీకరించడానికి, తిరస్కరించడానికి ఏమీ లేదు. నితీష్ కుమార్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనేది సరైన సమయంలో మాత్రమే నిర్ణయించబడుతుంది. కానీ నితీష్ కుమార్‌కు అంబేద్కర్ నగర్, మీర్జాపూర్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆఫర్ చేయబడింది.” ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడమే తన ధ్యేయమని ల\లన్ సింగ్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక లోక్‌సభ స్థానాలు ఉన్నందున 2024 ఎన్నికలకు ఎన్నికలపరంగా కీలకమైన రాష్ట్రమని లలన్ సింగ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ నుంచి బీజేపీకి 65 మంది ఎంపీలు ఉన్నారని, అఖిలేష్ యాదవ్, నితీశ్ కుమార్‌తో పాటు ఇతర ప్రతిపక్షాలు కలిస్తే కాషాయ పార్టీ 15-20 సీట్లకే పరిమితమయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు.
President Murmu: క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో పాల్గొనేందుకు లండన్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
అలహాబాద్‌లోని ఫుల్‌పూర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభ స్థానం అయిన వారణాసికి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ స్థానం నుంచి నితీష్‌కుమార్ పోటీ చేయాలని నిర్ణయించుకుంటే, 2024 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ డైనమిక్స్ మారవచ్చు. 2024లో నరేంద్ర మోడీకి సవాల్ రావాలంటే ఉత్తరప్రదేశ్‌లో భారీ విజయం సాధించాలని నితీష్ కుమార్‌కు తెలుసునని, అది కాకపోతే తన లక్ష్యం విఫలమవుతుందని నితీశ్ కుమార్‌కు తెలుసన రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.