బీహార్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. ఇక రబ్రీ దేవీ, తేజస్వి యాదవ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాటల దాడి చేశారు. రబ్రీ దేవిని అమ్మాయిగా చిత్రీకరిస్తూ మాట్లాడగా… తేజస్వి యాదవ్‌ను చిన్నపిల్లోడిగా సంబోధిస్తూ డైలాగ్ వార్ చేశారు.
సోమవారం బడ్జెట్ ప్రసంగంపై మాట్లాడుతుండగా లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంపై నితీష్ కుమార్ వ్యక్తిగత దూషణలకు దిగారు. శాసనమండలిలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ రబ్రీ దేవీ లేవనెత్తారు. తక్షణమే నితీష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతే నితీష్ కుమార్‌కు కోపం కట్టలు తెంచుకుంది. సహనం కోల్పోయిన ముఖ్యమంత్రి.. రబ్రీ దేవి వైపు వేలు చూపిస్తూ ఆమెను లాలూ తొలగించారంటూ వ్యా్ఖ్యానించారు.
ఇక అసెంబ్లీలో కూడా అదే మాదిరిగా ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌పై కూడా మండిపడ్డారు. ‘‘ముందు వినండి.. నువ్వు చిన్న పిల్లాడివి.. కూర్చో.. గొడవ చేయకు. ఏయ్..కూర్చో.’’ అని సంబోధించారు. నితీష్ కుమార్ వ్యాఖ్యలను లైట్ తీసుకున్నారో.. ఏమో తెలియదు గానీ.. తేజస్వి యాదవ్ నవ్వుతూనే కనిపించారు. ఇలాంటి సంఘటనలు పలుమార్లు జరగడంతో లైట్ తీసుకున్నారు.
అయితే నితీష కుమార్ తీరును ఆర్జేడీ ఖండించింది. పార్లమెంటరీ మర్యాదను మీరడం ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు అలవాటేనని లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య అన్నారు. చాలాసార్లు అసభ్యకరమైన భాషను ఉపయోగించారని ఆరోపించారు. రాష్ట్ర తొలి మహిళా ముఖ్యమంత్రిని ‘అమ్మాయి’ అని సంబోధించిన నితీష్ కుమార్ గురించి ఏం చెప్పాలని తేజస్వి యాదవ్ అడిగారు. పదే పదే మహిళల పట్ల లోపభూయిష్ట వైఖరిని ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు.
