యూపీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న ముందస్తుగానే నేతలు అధికార, అనధికార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎన్నికల హామీలను ఇస్తున్నారు. యూపీలో ఇప్పటికే అన్ని పార్టీలకన్నా ముందుగా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి తెరలేపింది. ఇప్పుడు ఎస్పీ, బీఎస్పీ పార్టీలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. కాగా తాజాగా కేంద్ర రవాణా శాఖ మంత్రి దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాబోయే ఐదేళ్లలో రూ. 5లక్షల కోట్ల వ్యయంతో రోడ్లను అభివృద్ధి చేస్తామని గడ్కరీ పేర్కొన్నారు.
యూపీ రోడ్లను అమెరికా రోడ్లలా మారుస్తామన్నారు. ప్రజలు డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి ఓటు వేయాలని ఆయన అన్నారు. అన్ని గ్రామాలను రోడ్లను హైవేలతో అనుసంధానించాలన్నది దివంగత ప్రధాని వాజ్‌పేయి కల అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజలకు నాణ్యమైన రవాణా సదుపాయాన్ని కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ఆయన తెలిపారు. దీనికోసం ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తుందని గడ్కరీ తెలిపారు.
