Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు.. కారణమిదేనా!

  • నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు
  • న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ సమావేశానికి డుమ్మా
  • పర్యటన రద్దుకు గల కారణాల వెల్లడించని అధికారులు
Nirmalasitharaman

Nirmalasitharaman

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రష్యా పర్యటన రద్దైంది. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ సమావేశంలో పాల్గొనేందుకు రష్యా వెళ్లేందుకు సిద్ధపడుతున్న తరుణంలో అనూహ్యంగా పర్యటనను రద్దు చేసుకున్నారు.

ఈ పర్యటన ద్వారా బ్రిక్స్ దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలనే దిశగా చర్చలు జరిగే అవకాశముందని భావించారు. ముఖ్యంగా సభ్య దేశాల మధ్య పెరుగుతున్న ఆర్థిక భాగస్వామ్యానికి ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్రిక్స్ కూటమికి చెందిన కీలక ఆర్థిక సంస్థ అయిన న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ మౌలిక వసతుల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడం, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య బహుళపాక్షిక సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా పనిచేస్తోంది. ఇంతటి కీలకమైన పర్యటనను నిరలమ్మ రద్దు చేసుకున్నారు. అయితే నిర్మలా సీతారామన్ పర్యటన రద్దుకు గల కారణాలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. పొదుపు మంత్రంలో భాగంగా రద్దు చేసుకుని ఉండొచ్చని ఊహాగానాలు వస్తున్నాయి.

పొదుపు మంత్రం ఆచరణ..
ప్రధాని మోడీ చెప్పినట్లుగానే కేంద్ర పెద్దల దగ్గర నుంచి రాష్ట్రాల వరకు పొదుపు మంత్రం ఆచరణలోకి తెస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రుల కాన్వాయ్‌లో వాహనాలు భారీగా తగ్గిపోయాయి. కేవలం రెండు వాహనాల్లోనే మోడీ ప్రయాణం చేశారు. మూడు వాహనాలతో హోంమంత్రి అమిత్ షా కాన్వాయ్ నడిచింది. ఇక రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కాన్వాయ్‌లో 11 వాహనాల నుంచి 4కి తగ్గిపోయాయి. ఇంధన ఆదా చర్యల్లో భాగంగా కేంద్ర పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు.

పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ఇప్పటికే ఆయా దేశాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొన్నాయి. ఇప్పుడు భారత్ వంతు వచ్చింది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సభలో మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ భవిష్యత్ కోసం పౌరులంతా పొదుపు మంత్రం పాటించాలని సూచించారు. ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయొద్దని.. విదేశీ ప్రయాణాలు మానుకోవాలని.. వర్క్ ఫ్రమ్ హోమ్ పాటించాలని.. ఇంధన ఆదా చేయాలని కోరారు. 24 గంటలు గడవక ముందే వడోదరలో కూడా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో విదేశీ మారక నిల్వలు అయిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పొదుపు మంత్రానికి కేంద్రం పిలుపునిచ్చింది.