Khalistan: ఖలిస్తాన్ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్‌ని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో గతేడాది లండన్ లోని భారత రాయబార కార్యాలయంపై ఖలిస్తాన్ అనుకూలవాదులు దాడికి తెగబడ్డారు. ఈ కేసును విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కీలక నిందితుడు ఇంద్రపాల్ సింగ్ గబాను గురువారం అరెస్ట్ చేసింది. యూకే లోని హౌన్స్ నివాసి అయిని ఇంద్రపాల్ సింగ్ మార్చి 22, 2023 భారత రాయబార కార్యాలయం దాడిలో కీలకంగా వ్యవహరించాడు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన కేసులో ఇతడు అరెస్ట్ చేయబడ్డాడు.
Read Also: Yadgiri: చపాతీ విషయంలో గొడవ.. ఒకరి హత్య..
గతేడాది మార్చి 18న ఖలిస్తాన్ మద్దతుదారు అమృత్‌పాల్ సింగ్‌పై పంజాబ్ పోలీసులు చర్యలు తీసుకున్నందుకు ప్రతీకారంగా భారత హైకమిషన్‌పై దాడులు జరిగినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. మార్చి 19, మార్చి 22న లండన్‌లో భారతీయ మిషన్లు, దాని అధికారులపై దాడులకు తెగబడ్డారు. ఇది పెద్ద కుట్రలో భాగమని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.
లండన్ భారత హైకమిషన్ ముందు నిరసన చేపట్టడమే కాకుండా మొదటి అంతస్తు బాల్కానీలోని భారత జాతీయ జెండాను తీసివేశారు. ఈ చర్య తర్వాత భారత రాయబార సిబ్బంది మరింత పెద్ద జెండాను అక్కడ ఉంచారు. భారత జెండాను అపవిత్రం చేయడాన్ని వ్యతిరేకిస్తూ UKలోని భారతీయ సమాజం ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లండన్ మేయర్, బ్రిటన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. భారత విదేశీ మంత్రిత్వ శాఖ ఢిల్లీలోని యూకే సీనియర్ దౌత్యవేత్తను పిలిచి, రాయబార కార్యాలయంపై భద్రత లేకపోవడంపై వివరణ కోరింది. తమ రాయబార సిబ్బందిపై యూకే ప్రభుత్వం ఉదాసీన వైఖరి ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. లండన్ రాయబార కార్యాలయ దాడి కేసులో యూఏపీఏ చట్టం కింద ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసుని తర్వాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎన్ఐఏకి అప్పగించింది.