NTV Telugu Site icon

Russia: భారతీయులను మా ఆర్మీలో ఎన్నడూ కోరుకోలేదు..

Modi, Putin

Modi, Putin

Russia: ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా ఆర్మీలో సహాయక సిబ్బందిగా రిక్రూట్ అయిన భారతీయులను తిరిగి సొంత దేశాని పంపాలని భారత్ చేసిన విజ్ఞప్తిని రష్యా పరిగణలోకి తీసుకుంది. ఇటీవల రష్యాలో పర్యటించిన ప్రధాని నరేంద్రమోడీ ఈ విషయాన్ని అధ్యక్షుడు పుతిన్ వద్ద ప్రస్తావించారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరిస్తామని ఆశిస్తున్నట్లు రష్యా బుధవారం తెలిపింది. వారి రిక్రూట్‌మెంట్ పూర్తిగా వాణిజ్యపరమైదని రష్యా చెప్పింది. రష్యా యొక్క ఛార్జ్ డి అఫైర్స్ రోమన్ బాబుష్కిన్ మాట్లాడుతూ.. రష్యా తన సైన్యంలో భారతీయులు ఎప్పుడూ భాగస్వామ్యం కావాలని కోరుకోలేదని, వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని అన్నారు.

ఈ అంశంపై భారత్, తాము ఒకే పక్షంలో ఉన్నామని, ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని ఆయన విలేకరుల సమావేశంలో అన్నారు. ప్రధాని మోడీ తన పర్యటనలో ఈ సమస్యను పుతిన్ వద్ద లేవనెత్తారు. రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారత సిబ్బందిని త్వరగా విడుదల చేయాలని ఆయన కోరడంతో, వారిని స్వదేశానికి పంపిస్తామని రష్యా హామీ ఇచ్చింది. ఈ సమస్యను రాజకీయం చేయరాదని బాబూష్కిన్ అన్నారు. భారతీయులు రష్యా తమ సైన్యంలో భాగం కావాలని ఎప్పుడూ పిలుపునివ్వలేదనే విషయాన్ని గుర్తు చేశారు. చాలా మంది భారతీయులు డబ్బు సంపాదించాలని కోరుకున్నందున వాణిజ్యపరంగా ఇలాంటి వాటిలో నియమించబడ్డారని చెప్పారు. భారతీయుల సంఖ్య 50, 60 లేదా 100 మందిగా ఉందని చెప్పారు.

Read Also: Rahul Gandhi: బీజేపీది “విద్యా వ్యతిరేక మనస్తత్వం”.. ఐఐటీ విద్యార్థుల పరిస్థితిపై రాహుల్..

సపోర్టు స్టాఫ్‌గా రిక్రూట్ అయిన చాలా మంది భారతీయులు పనిచేయడానికి సరైన వీసాలు లేనందున చట్టవిరుద్ధంగా పనిచేస్తున్నట్లు బాబూష్కిన్ అన్నారు. వీరిలో ఎక్కువగా టూరిస్ట్ వీసాలపై రష్యా వచ్చిన వారే అని తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు పరిహారం, రష్యన్ పౌరసత్వం ఇవ్వబడుతుందా…? అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా కాంట్రాక్ట్ ప్రకారం, అది ఎలాగైనా జరగాలి అని అన్నారు. రష్యన్ సైన్యం సేవ నుండి భారతీయ పౌరులందరినీ త్వరగా డిశ్చార్జ్ చేస్తామని రష్యా వాగ్దానం చేసిందని విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా అన్నారు.

రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో రష్యా సైన్యంలో పనిచేస్తున్న ఇద్దరు భారతీయులు మరణించడంతో భారత్‌లో ఆందోళన పెరిగింది. ప్రస్తుతం ఈ మరణాల సంఖ్య నాలుగుకు చేరుకుంది. మార్చిలో, 30 ఏళ్ల హైదరాబాద్ నివాసి మహ్మద్ అస్ఫాన్ ఉక్రెయిన్‌తో ఫ్రంట్‌లైన్‌లో రష్యా దళాలతో పనిచేస్తున్నప్పుడు గాయాలతో మరణించాడు. ఫిబ్రవరిలో గుజరాత్‌లోని సూరత్‌కి చెందిన 23 ఏళ్ల హేమల్ అశ్విన్‌భాయ్ మంగువా డోనెట్స్క్ ప్రాంతంలో “సెక్యూరిటీ హెల్పర్”గా పనిచేస్తున్నప్పుడు ఉక్రేనియన్ వైమానిక దాడిలో మరణించాడు.