NTV Telugu Site icon

Farmers Protest: “మోడీ గ్రాఫ్‌ని తగ్గించాల్సిన అవసరం ఉంది”.. రైతు నేత వివాదాస్పద రాజకీయ వ్యాఖ్యలు..

Farmers Protest

Farmers Protest

Farmers Protest: పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)తో సహా 12 కీలక డిమాండ్లను పరిష్కరించాలని కోరతూ రైతులు మరోసారి ఉద్యమానికి సిద్ధమయ్యారు. ‘‘ఢిల్లీ ఛలో’’ పేరుతో దేశ రాజధానిని ముట్టడించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి ప్రయత్నాలను పోలీసులు, కేంద్ర బలగాలు అడ్డుకుంటున్నాయి. హర్యానా-ఢిల్లీ సరిహద్దుల్లో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైతుల్ని, నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లను వాడుతున్నారు. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు, ముళ్ల కంచెలను ఉంచి రైతులు ట్రాక్టర్లను అడ్డుకున్నారు.

Read Also: INDIA bloc: ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ.. ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టం చేసిన ఫరూక్ అబ్దుల్లా..

ఇదిలా ఉంటే, రైతు సంఘం నేత ప్రధాని మోడీని ఉద్దేశించి రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. రైతు నాయకుడు దల్లేవాల్ మాట్లాడుతూ..‘‘ మోడీ పాపులారిటీ ఇప్పుడు పీక్స్‌లో ఉంది, రామ మందిరం వల్ల ఆయన గ్రాఫ్ పెరిగింది. ఈ గ్రాఫ్ తగ్గించాల్సిన సమయం వచ్చింది’’ అని 2024 లోక్‌సభ ఎన్నిలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ స్పందిస్తూ.. ఈ వ్యాఖ్యలు సరికాదని, కానీ వారికి ఎక్కడి నుంచో మద్దతు లభిస్తున్నట్లు తెలుస్తోందని, పంజాబ్ ప్రభుత్వం వారిని అడ్డుకోగలదు, కానీ వారు అలా చేయలేదని, మరోవైపు రైతు ఉద్యమానికి తాము మద్దతు ఇస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం చెబుతోందని అన్నారు. రైతు నేత చేసింది రాజకీయ ప్రకటన అని, ఇలా చేస్తే ప్రజలు మోడీకి మద్దతు ఇవ్వకుండా మానేస్తారా.? అని ప్రశ్నించారు. నిరసన తెలిపేందుకు ఇది సరైన మార్గం కాదని అన్నారు. వారు ఢిల్లీకి వెళ్లేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ రైళ్లు, బస్సులు, సొంత వాహనాలు ఉండగా.. ట్రాక్టర్ల ద్వారా వెళ్లడం ఆమోదయోగ్యం కాదని అన్నారు. జగ్జీత్ సింగ్ దల్లేవాల్ భారతీ కిసాన్ యూనియన్ (ఏక్తా సిద్ధూపూర్)కు నాయకత్వం వహిస్తున్నారు.