Amit Shah: కేంద్రం హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రిత్వ శాఖ పనితీరుపై జరిగిన చర్చలో సమాధానమిస్తూ.. ‘‘ఈ దేశంలో మార్చి 31, 2026 నాటికి నక్సలిజం నిర్మూలించబడుతుందని చెబుతున్నా’’ అని అన్నారు. ఇటీవల, వరసగా జరుగుతున్న ఎన్‌కౌంటర్లలో పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణిస్తున్నారు. నక్సలిజం పొలిటికల్ సమస్య కాదని, పశుపతినాథ్ నుంచి తిరుపతి వరకు రెడ్ కారిడార్, మావోయిస్టుల నెట్‌వర్క్‌ను ధ్వంసం చేశామని చెప్పారు. ఇప్పుడు కేవలం 12 మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ఉన్నాయని.. సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాల పనితీరు భేష్ అంటూ కొనియాడారు.
Read Also: Rain Alert: ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు
ఇదిలా ఉంటే, జమ్మూ కాశ్మీర్ అంశం, ఉగ్రవాదం గురించి కూడా హోం మంత్రి మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత, జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులతో భారత యువత ప్రమేయం దాదాపుగా కనుమరుగైందని శుక్రవారం అన్నారు. యూపీఏ పాలనలో ఉగ్రవాదుల్ని కీర్తించే వారని, ఎన్డీయే పాలనలో ఇది అంతమైందని చెప్పారు. ‘‘పదేళ్ల క్రితం ఉగ్రవాదుల అంత్యక్రియల ఊరేగింపులు సర్వసాధారణం, ప్రజలు వారిని కీర్తించేవారు. కానీ ఇప్పుడు ఉగ్రవాదులు చస్తే వారిని అక్కడికక్కడే ఖననం చేస్తున్నారు. వారి బంధువులు ఒకప్పుడు ప్రభుత్వం ప్రోత్సాహకాలు, పదవుల్ని అనుభవించేవారని, ఇప్పుడు వారందర్ని నిర్దాక్షిణ్యంగా తొలగించి బలమైన సందేశం పంపామని’’ అమిత్ షా అన్నారు.
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద ఘటనలు తగ్గినట్లు డేటాను సభలో ప్రస్తావించారు. గణాంకాలను పోల్చి చూస్తే, 2004 మరియు 2014 మధ్య, ఈ ప్రాంతంలో 7,217 ఉగ్రవాద సంఘటనలు జరిగాయని, 2014 మరియు 2024 మధ్య ఈ సంఖ్య 2,242కి తగ్గిందని ఆయన అన్నారు. మోడీ ప్రభుత్వంలో ఉగ్రవాదం కారణంగా మరణాలు 70 శాతం తగ్గాయని చెప్పారు. గత ప్రభుత్వాలు ఉగ్రవాదంపై మృదువుగా వ్యవహరించేవని, ఇప్పటి మోడీ ప్రభుత్వం ఉగ్రవాదంపై ‘‘జీరో-టాలరెన్స్’’ విధానంతో ఉందని వెల్లడించారు. కాశ్మీర్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. జీ20 సమావేశం జరిగిందని, కాశ్మీర్‌లో సినిమా థియేటర్లు సాయంత్రం వేళల్లో తెరిచి ఉంటున్నాయని చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌లో ఇప్పటికే రూ. 12,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, రూ. 1.1 లక్షల కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలు (ఎంఓయులు) కుదుర్చుకున్నాయని షా పేర్కొన్నారు.