ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పీరియడ్స్ కారణంగా నవరాత్రి సమయంలో ఉపవాసం ఉండి.. దుర్గాదేవిని పూజించలేకపోయానన్న మనస్తాపంతో 36 ఏళ్ల ప్రియాంషా సోని విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
తొమ్మిది రోజుల పాటు నవరాత్రి వేడుకలు జరుగుతాయి. ఈ వేడుకల కోసం ఏడాది నుంచే సోని సిద్ధపడుతోంది. మార్చి 30న నవరాత్రి మొదటి రోజు ప్రారంభమైంది. ముందు రోజు భర్త ముఖేష్ చేత.. పూజకు కావాల్సిన వస్తువులన్నీ తెప్పించింది. పువ్వులు, పండ్లు, స్వీట్లు, దీపాలు, ధాన్యాలు తీసుకొచ్చాడు. దేవతా ప్రతిమను కూడా తీసుకొచ్చాడు. పూజకు కావాల్సిన అన్ని సిద్ధం చేసుకుని వేడుకకు సిద్ధపడుతున్న సమయంలో కరెక్ట్‌గా సోనికి పీరియడ్స్ ప్రారంభమైంది. ఒక్కసారిగా ఆమె ఆశలన్నీ ఆవిరైపోయాయి. రుతుక్రమం సమయంలో పూజ చేయడం కానీ… ప్రార్థన చేయడం కానీ.. ఉపవాసం ఉండకూడదని సిద్ధాంతం ఉంది. దీంతో ఏడాది నుంచి ఎన్నో ఆశలు పెట్టుకుని పూజకు సిద్ధపడుతున్న సమయంలో ఋతుస్రావం ప్రారంభం కావడంతో అపవిత్రంగా భావించింది. ఇరుగుపొరుగు వారు కూడా అదే సలహా ఇచ్చారు.
అప్పటికీ భర్త ముఖేష్.. ఆమెను సముదాయించి.. నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. పీరియడ్స్ అనేది సహజమైన ప్రక్రియ అని.. దాని గురించి పెద్దగా పట్టించుకోవద్దని కూడా సలహా ఇచ్చాడు. అయినా కూడా సోని జీర్ణించుకోలేకపోయింది. చాలా ఒత్తిడికి.. ఆందోళనకు గురైంది. తీవ్ర మనస్తాపం చెంది. భర్త పనికి వెళ్లగానే సోని చాలా సేపు ఏడ్చింది. దీంతో భర్త తిరిగి ఇంటికి వచ్చి చాలా ఓదార్చాడు. బాగానే ఉంది అనుకుని తిరిగి పనికి వెళ్లగానే.. సోని విషం సేవించింది. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. తాను తప్పు చేశానని.. విషం సేవించినట్లుగా చెప్పింది. వైద్యులు పరీక్షించి.. చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. స్థలం మార్పు చేస్తే.. పరిస్థితి కుదిటపడుతుందని భావించిన ముఖేష్.. సోనిని ఆమె తల్లిదండ్రుల ఇంటికి తీసుకెళ్లాడు. ఇంతలోనే మరోసారి ఆమె పరిస్థితి విషమించడం మరోసారి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ ఈసారి మాత్రం 15-20 నిమిషాల్లోనే ఆమె కన్నుమూసింది. దీంతో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులంతా కన్నీరుమున్నీరుగా విలపించారు. సోనికి ప్రస్తుతం 3 సంవత్సరాల జాన్వి, 2 సంవత్సరాల మాన్వి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.