National herald case – ED seals Young Indian’s office: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీలోని బహదూర్ షా జాఫర్ మార్గ్ లోని నేషనల్ హెరాల్డ్ ఆఫీసులో ఉన్న యంగ్ ఇండియా కార్యాలయాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) సీజ్ చేసింది. ఈ ఘటన గాంధీ కుటుంబానికి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. హెరాల్డ్ హౌజ్ భవనానికి సంబంధించిన ఆర్డర్లను కూడా ఈడీ అతికింది. గత రెండు రోజులుగా నేషనల్ హెరాల్డ్ కేసులో సోదాలు చేస్తోంది ఈడీ. తాజాగా యంగ్ ఇండియా కార్యలయాన్ని సీజ్ చేసింది. ఈడీ ముందస్తు అనుమతులు లేకుండా సీజ్ చేసిన ప్రదేశాన్ని తెరవకూడదంటూ.. ఈడీ హెచ్చరించింది. సాక్ష్యాధారాలు తారుమారు చేయకుండా ఇలా చేసినట్లు ఈడీ తెలిపింది. అయితే నేషనల్ హెరాల్డ్ సీనియర్ అధికారులు తమకు సహకరించడం లేదని.. దీంతో సీజ్ చేయడం తప్పితే వేరే మార్గం లేదని ఈడీ అధికారులు తెలుపుతున్నారు. “యంగ్ ఇండియా లిమిటెడ్” సంస్థకు ప్రిన్సిపల్ ఆఫీసర్ గా ఉన్న మల్లికార్జున్ ఖర్గే ఆక్కడి నుండి వెళ్ళిపోయారని.. సోదాల నిర్వహణకు ఖర్గేకు సమన్లు పంపించామని ఈడీ వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే ఈడీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని, రాహుల్ గాంధీని పలుమార్లు విచారించింది. నేషనల్ హెరాల్డ్, యంగ్ ఇండియాల మధ్య అక్రమ లావాదేవీలు, మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది. దీంట్లో భాగంగానే కాంగ్రెస్ నేతలను ఈడీ వరసగా హెచ్చరిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేతో పాటు పవన్ బన్సల్ ను విచారించింది ఈడీ. కాంగ్రెస్ నేతలు ఆందోళనకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో నేషనల్ హెరాల్డ్ కార్యాలయం వద్ద భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లే మార్గాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. తాజాగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి కాంగ్రెస్ కీలక నేతలు మల్లికార్జున ఖర్గే, సల్మాన్ ఖుర్షీద్, దిగ్విజయ్ సింగ్, చిదంబరం చేరుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నివాసంతో పాటు.. 10 జన్ పథ్ కార్యాలయం వెలుపల భారీగా పోలీసులు మోహరించారు.
Read Also: Commonwealth Games: భారత్ ఖాతాలో మరో పతకం.. వెయిట్ లిఫ్టింగ్‌లో కాంస్యం
ఇదిలా ఉంటే ఈడీ చర్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ హౌజ్ పై దాడిని కాంగ్రెస్ పార్టీపై చేసిన దాడిగా జైరాం రమేష్ అభివర్ణించారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని.. దీన్ని ఖండిస్తున్నామని.. మీరు మమ్మల్ని నిశబ్ధంగా ఉంచలేదని జైరాం రమేష్ ట్వీట్ చేశారు. ఏఐసీసీని పోలీస్ కంటోన్మెంట్ గా మార్చారని.. ప్రభుత్వం మమ్మల్ని కావాల్సినంతగా అణచివేయవచ్చని.. కానీ మేము ద్రవ్యోల్భనం, నిరుద్యోగం, జీఎస్టీపై నిరసన తెలుపుతామని.. జైలు శిక్షవిధించినా ముందుకే వెళ్తాం అని అజయ్ మాకెన్ అన్నారు. 10 జన్ పథ్, కాంగ్రెస్ కార్యాలయాన్ని పోలీస్ కంటోన్మెంట్ గా మార్చి అప్రకటిత ఎమర్జెన్సీ విధించారని.. యంగ్ ఇండియా కార్యాలయాన్ని బలవంతంగా సీజ్ చేశారని.. నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలతో కలిసి కాంగ్రెస్ పోరాడుతుందని.. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు.
