Site icon NTV Telugu

Nagpur: అమానుషం.. 12 ఏళ్ల బాలుడు 2 నెలల నుంచి నిర్బంధం.. కారణమిదే!

Nagpur

Nagpur

‘‘మొక్కై వంగనిది మ్రానై వంగునా’’ అని పెద్దలు అంటుంటారు. పిల్లలు చెడు అలవాట్లకు గురి కాకుండా చిన్నతనం నుంచే మంచి అలవాట్లు నేర్చించాలని అంటారు. అవి జీవితాంతం తోడుంటాయని చెబుతుంటారు. అయితే చిన్నప్పుడు క్రమశిక్షణ పెట్టకుండా పెద్దయ్యాక బుద్ధులు నేర్పించకపోతే ఏం ప్రయోజనం ఉంటుంది. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. 12 ఏళ్ల కొడుకు దొంగతనాలకు పాల్పడుతున్నాడని తల్లిదండ్రులు అమానుష చర్యకు పాల్పడ్డారు. సంకెళ్లతో బంధించి దుశ్చర్యకు పాల్పడ్డారు.

ఇది కూడా చదవండి: Chhattisgarh Encounter: అభయారణ్యంలో కాల్పుల మోత.. 14 మంది మావోయిస్టులు హతం

నాగ్‌పూర్‌కు చెందిన దంపతులు దినసరి కూలీలు. 12 ఏళ్ల కొడుకు స్కూల్‌కు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఈ క్రమంలో అల్లరి పిల్లాడిగా మారడమే కాకుండా ఇళ్లల్లో మొబైల్ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. దీంతో బిడ్డను క్రమశిక్షణలో పెట్టేందుకు కఠిన చర్యలకు దిగారు. ప్రతిరోజూ కూలీ పనులకు వెళ్లే ముందు కొడుకును స్తంభానికి సంకెళ్లు వేసి వెళ్లిపోయేవారు. దీంతో పిల్లాడు ఆకలితో అల్లాడిపోయాడు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఇది కూడా చదవండి: Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ ఏ పార్టీకి రిమోట్ కంట్రోల్ కాదు.. అన్ని మతాలను గౌరవిస్తాం

సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గొలుసులతో బంధించిన బాలుడిని విడిపించారు. ఈ క్రమంలో బాలుడు తీవ్ర భయాందోళనకు గురైనట్లుగా కనిపెట్టారు. బాలుడి కాళ్లు, చేతులకు గాయాలైనట్లుగా జిల్లా మహిళా, శిశు అభివృద్ధి కార్యాలయం బృందం గుర్తించింది. వెంటనే బాలుడికి చికిత్స అందించి సురక్షితమైన ప్రదేశానికి తరలించారు. తల్లిదండ్రులు గత 2 నెలలుగా ఇలా చేసినట్లుగా గుర్తించారు. మాట వినడం లేదని.. అల్లరి చిల్లరగా తిరగడమే కాకుండా ఫోన్లు దొంగిలించడంతోనే బంధించినట్లుగా తల్లిదండ్రులు చెప్పారు. తరచుగా ఇంట్లో నుంచి పారిపోతున్నాడనే గొలుసులతో బంధించినట్లు తెలిపారు.

తల్లిదండ్రులపై జువెనైల్ జస్టిస్ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుడిని అదుపులోకి తీసుకుని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC)కి పంపారు. బాలుడికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఈ సంఘటన గురించి పోలీసులకు రెండుసార్లు సమాచారం ఇచ్చినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపించారు. స్థానికులు చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ (1098)కు సమాచారాన్ని అందించగా రెస్క్యూ బృందం వెంటనే చర్యలు తీసుకుందని వెల్లడించారు. పిల్లల పట్ల ఏ విధమైనా వేధింపులు, హింస గమనించినట్లయితే వెంటనే పిల్లల రక్షణ వ్యవస్థకు లేదా పోలీసు యంత్రాంగానికి తెలియజేయాలని చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ పౌరులకు విజ్ఞప్తి చేసింది.

Exit mobile version