Nagpur: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. 28 ఏళ్ల తర్వాత బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది. ఠాక్రేలు ముంబైపై తమ పట్టును కోల్పోయారు. ఇదే కాకుండా, పవార్‌ల ప్రభావం ఉన్న సీట్లను కూడా బీజేపీ గెలుచుకుంది. ఇదిలా ఉంటే, అనూహ్యం కొన్ని స్థానాల్లో మాత్రం అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఎంఐఎం పార్టీ సత్తా చాటింది. ముఖ్యంగా ఔరంగాబాద్, ముంబై, నాగ్‌పూర్ నగరాల్లో కూడా ఎంఐఎం మంచి ప్రదర్శన కనబరిచింది.
Read Also: Reservations: తెలంగాణలో కార్పొరేషన్, మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి వివరాలు ఇవే..
ఇదిలా ఉంటే, 2025 నాగ్‌పూర్ అల్లర్లలో కీలక నిందితుడిగా ఉన్న వ్యక్తి భార్య నాగ్‌పూర్‌లో కార్పొరేటర్‌గా గెలిచింది. ఎంఐఎం టికెట్‌పై అశీనగర్ జోన్, వార్డ్ నంబర్ 3 నుంచి పోటీ చేసిన 29 ఏళ్ల అలిషా ఖాన్, బీజేపీ అభ్యర్థి భాగ్యశ్రీ కనాటోడేపై గెలుపొందారు. అలిషా ఖాన్, మైనారిటీ డెమోక్రాటిక్ పార్టీ (MDP) నగర అధ్యక్షుడు ఫహీమ్ ఖాన్ భార్య. ఫహీమ్ ఖాన్ గతేడాది మార్చి 17న నాగ్‌పూర్‌లో జరిగిన హింసాత్మక అల్లర్లలో కీలక నిందితుడుగా ఉన్నాడు.
ఛత్రపతి సంభాజీనగర్‌లోని ఔరంగజేబ్ సమాధి తొలగించాలని డిమాండ్ చేస్తూ వీహెచ్‌పీ నిరసనలు నిర్వహించింది. ఆ సమయంలో మతపరమైన శాసనాలు,ఉన్న ‘‘చాదర్’’ను దహనం చేశారనే పుకార్లతో ఈ హింస చెలరేగింది. ఫహీమ్ ఖాన్‌పై పలు కఠినమైన చట్టాల కింద కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయట ఉన్నాడు. నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎంఐఎం 06 వార్డుల్ని గెలుచుకుంది.