Mumbai-Bound Vande Bharat Train Hits Cattle: ఇండియన్ రైల్వేస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మరోసారి ప్రమాదానికి గురైంది. ఈ రైలు సేవలు ప్రారంభం అయిన తర్వాత నాలుగోసారి ప్రమాదానికి గురైంది. గాంధీనగర్-ముంబై వందేభారత్ ఎక్స్‌ప్రెస్ గురువారం సాయంత్రం పశువులను ఢీకొట్టింది. గుజరాత్ లోని ఉద్వాడ-వాపి స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగినట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ప్రమాదంతో రైలు ముందుభాగానికి చిన్నపాటి డెంట్ ఏర్పడింది.
Read Also: Russia: పాకిస్తాన్‌కు రష్యా షాక్.. డిస్కౌంట్‌కు చమురు ఇచ్చేందుకు నిరాకరణ
రెండు నెలల క్రితం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సేవలు ప్రారంభం అయ్యాయి. ఈ రెండు నెలల్లో నాలుగు సార్లు రైలు ట్రాకుపైకి వచ్చిన పశువులను ఢీకొట్టింది. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే పునరావృతం అయింది. పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుమిత్ ఠాకూర్ మాట్లాడుతూ ఉద్వాడ మరియు వాపి మధ్య లెవల్ క్రాసింగ్ గేట్ నంబర్ 87 సమీపంలో సాయంత్రం 6.23 గంటలకు ఈ సంఘటన జరిగిందని చెప్పారు. ప్రమాదానికి గురైన రైలు పది నిమిషాల వ్యవధిలోనే తన ప్రయాణాన్ని కొనసాగించింది. డెంట్ పడిన ముందరి భాగాన్ని రాత్రి వరకు మారుస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు.
అంతకుముందు కూడా ఇదే రూట్లో ట్రైన్ గేదెలను ఢీకొట్టింది. ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. అయితే ఈ ప్రమాదంపై చాలా మంది వందేభారత్ ట్రైన్ పై విపరీతంగా ట్రోలింగ్ నడిచింది. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాగా ప్రమాదం జరిగిన ఒక్క రోజులోనే దీనికి మరమ్మత్తులు చేసింది రైల్వే శాఖ. ఈ ఘటన తర్వాత ఇలాగే మరో రెండు ఘటనలు జరిగాయి. సెప్టెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోదీ గాంధీ నగర్లో ఈ సెమీ హై స్పీడ్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించారు. ఈ తరువాతి రోజు నుంచే ఇది గాంధీ నగర్- ముంబైల మధ్య పరుగులు తీస్తోంది. భారత ప్రభుత్వ రైల్వేల ఆధునీకీకరణలో భాగంగా సెమీ హై స్పీడ్ వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.