ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కొద్దీ.. రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.. వరుసగా ముగ్గురు మంత్రులు, 11 మంది ఎమ్మెల్యేలను సమాజ్ వాదీ పార్టీలో చేర్చుకుని.. భారతీయ జనతా పార్టీకి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ షాక్ ఇస్తే.. ఇక, తిరిగి చెల్లించే పనిలో పడిపోయింది అధికార బీజేపీ.. నిన్నటికి నిన్నే ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ బీజేపీలో చేరిగా.. తాజాగా ములాయం తోడల్లుడు, ఎస్పీ మాజీ ఎమ్మెల్యే ప్రమోద్ గుప్తా కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.. 2012 ఎన్నికల్లో ఎస్పీ నుంచి బరిలోకి దిగి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన.. 2014 ఎన్నికల సమయంలో శివపాల్-అఖిలేష్ మధ్య విభేదాలు వచ్చినప్పుడు ఎస్పీని వీడారు. బీజేపీలో చేరిన సందర్భంగా అఖిలేష్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు గుప్తా.. మాఫియా, నేరస్థులను పార్టీలో చేర్చుకుంటున్నారని.. ఇక, పార్టీలో ములాయం సింగ్ ఓ ఖైదీగా మారిపోయారని ఆరోపించారు. శివపాల్ యాదవ్ పరిస్థితి కూడా దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు.