Supreme Court: కొడుకు ప్రేమ వ్యవహారాన్ని తల్లి ఒప్పుకోకపోవడం అనేది, అతడిని ప్రేమించిన అమ్మాయి ఆత్మహత్యను ప్రేరేపించినట్లు కాదని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. తన ప్రేమికుడిని వివాహం చేసుకోకుండా జీవించలేదని, ఆత్మహత్యకు పాల్పడటం, సదరు అమ్మాయిన ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కాదని సుప్రీకోర్టు స్పష్టం చేసింది. ‘‘ఐపీసీ సెక్షన్ 306 కింద అభియోగాలను మోపాలంటే ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని అణగదొక్కే వాతావరణాన్ని సృష్టించే చర్యలు అవసరం’’ అని న్యాయమూర్తులు బీ.వీ నాగరత్న, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
జూన్ 13, 2014న కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుకు వ్యతిరేకంగా లక్ష్మీ దాస్ దాఖలు చేసిన అప్పీల్‌ను కోర్టు అనుమతించింది. అంతకుముందు హైకోర్టు ఉత్తర్వుల్లో తన కొడుకు ప్రేమ వ్యవహారాన్ని ఒప్పుకోకపోవడంతో అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపించిన ఛార్జిషీట్‌ని కొట్టివేయాలని ఆమె చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. సదరు అమ్మాయి జూలై 3, 2008న ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో తల్లి, ఆమె కొడుకు, మరో నలుగురు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. హైకోర్టు ఇద్దరు నిందితులు ఆమె భర్త, కొడుకుపై చర్యల్ని రద్దు చేసింది.
Read Also: Bihar : డబుల్ కాట్ బెడ్ కూడా సరిపోలేదు.. బీహార్ లో కట్టలు కూడబెట్టిన ప్రభుత్వ అధికారి
పోలీసుల దర్యాప్తు ప్రకారం.. మృతురాలు, కొర్టులో అప్పీలు చేసిన మహిళ కుమారుడు బాబు దాస్ మధ్య ప్రేమ వ్యవహారానికి సంబంధించిన కేసు. ఈ కేసులో మృతురాలి తల్లిదండ్రులు కూడా వీరిద్దరి ప్రేమను అంగీకరించలేదు, పలుమార్లు దీనిని ముగించడానికి ప్రయత్నించారు. అయితే, నిందితుడు బాబు దాస్, అమ్మాయిని రిలేషన్ కోసం ప్రోత్సహించాడనే ఆరోపణలు ఉన్నాయి. బాధిత మహిళ ట్రైన్ ఢీకొట్టడంతోనే మరణించినట్లు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది.
ఈ కేసులో బాబుదాస్ తల్లి, తాను అమ్మాయి ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని సుప్రీంకోర్టులో వాదించారు. వివాహాన్ని తిరస్కరించిన మాట నిజమే అయినప్పటికీ, అవి సెక్షన్ 306 ప్రకారం నేరంగా పరిగణించబడవని ఆమె వాదించారు. ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు, ఇందులో ప్రత్యక్ష, పరోక్షంగా ప్రేరేపించడం లేదా, ఆత్మహత్యకు దగ్గరగా ఉండటం, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి స్పష్టమైన కారణాలు లేవని గమనించింది.
“అనేక న్యాయస్థాన తీర్పులను పరిశీలించిన తరువాత, మేము హైకోర్టు మరియు ట్రయల్ కోర్టుతో ఏకీభవించలేకపోతున్నాము. చార్జిషీట్ మరియు సాక్షుల వాంగ్మూలాలతో సహా రికార్డులో ఉన్న అన్ని ఆధారాలు సరైనవని తీసుకున్నప్పటికీ, అప్పీలుదారునికి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలు లేవు” అని ధర్మాసనం పేర్కొంది. బాబుదాస్‌తో సంబంధాన్ని ముగించాలని మృతురాలిపై అతడి తల్లి కానీ ఆమె కుటుంబం కానీ ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని కోర్టు గుర్తించింది. నిజానికి ఈ సంబంధాన్ని మరణించిన అమ్మాయి కుటుంబమే వ్యతిరేకించినట్లు తెలిపింది.