NTV Telugu Site icon

Monsoon: జూన్ 9న కేరళలోకి రుతుపవనాలు.. బిపోర్జాయ్ తుఫాన్ ప్రభావం..

Monsoon

Monsoon

Monsoon: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ఆగనమనం ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా జూన్ మొదటివారంలోనే రుతుపవానాలు కేరళ తీరాన్ని తాకాలి. అయితే ఇప్పటి వరకు కేరళను చేరుకోలేదు. జూన్ 4న రెండు రోజులు ఆలస్యంగా కేరళలోకి నైరుతి రుతుపవనాలు వస్తాయని ముందుగా భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) అంచనా వేసింది. అయితే అరేబియా సముద్రంలో ‘బిపోర్జాయ్’ తుఫాన్ ఏర్పడటంతో నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే శుక్రవారం అంటే జూన్ 9 నాటికి కేరళను రుతుపవనాలు తాకే అవకాశం ఉందని, అందుకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ బుధవారం అంచనా వేసింది. ఇదిలా ఉంటే ఈ రుతుపవనాల రాక మరింత ఆలస్యం అవుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ ‘స్కైమెట్’ అంచనా వేస్తోంది. బిపోర్జాయ్ తుఫాన్ కారణంగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకేందుకు మరో 2-3 రోజులు పట్టే అవకాశం ఉందని అంచనా వేసింది.

Read Also: Arvind Kejriwal: కన్నీరు పెట్టుకున్న ముఖ్యమంత్రి..

గతేడాది జూన్1న కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకాయి. ఈ ఏడాది ఆ తేదీ నాటికి కనీసం శ్రీలంకను కూడా దాటలేదు. ప్రస్తుతం అరేబియా సముద్రంలో తుఫాన్ కారణంగా రుతుపవనాల కదలిక బలహీనంగా ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ ఏడాది సాధారణంతో పోలిస్తే 96 శాతం వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికితోడు ఎల్ నినో ప్రభావం కూడా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్జాయ్ తుఫాన్ వేగంగా బలపడుతోంది. తీవ్ర తుఫాన్ గా మారింది. బుధవారం ఉదయం 5.30 గంటలకు గోవాకు 890 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ నైరుతి ప్రాంతంలో, ముంబాయికి 1000 కిలోమీటర్ల నైరుతిలో, పోర్ బందర్ కు 1,070 కిలోమీటర్ల దూరం దక్షిణాన- నైరుతిలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. రాగల మూడు రోజుల్లో ఇది ఉత్తర-వాయువ్య దిశలో కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముందు జాగ్రత్తలో సముద్రంలోకి ప్రజలు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Show comments