NTV Telugu Site icon

Heavy Rains: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. కర్ణాటక, తెలంగాణలో రెడ్‌ అలర్ట్

Heavy Rains In Country

Heavy Rains In Country

దేశంలో రుతుప‌వ‌నాలు చురుగ్గా క‌దులుతుండ‌టంతో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలు నీట‌మునిగాయి. వ‌ర‌ద‌లు పోటెత్తి అనేక మంది గ‌ల్లంత‌య్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా గడ్చిరౌలి జిల్లాలోని 130 గ్రామాలకు మధ్య సంబంధాలు తెగిపోయాయి. మరో వైపు నాందేడ్‌, హింగోలి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. కర్ణాటక, తెలంగాణలో రెడ్‌ అలర్ట్‌లు జారీ చేశారు.

రాబోయే ఐదు రోజుల పాటు భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దేశ మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఇక ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, ఒడిశా, గోవా, మహారాష్ట్రలోని మరట్వాడ, ఛత్తీస్‌గడ్‌, మధ్య ప్రదేశ్‌, కేరళ, కర్ణాటకల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది. హరియాణా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో పిడుగుల కారణంగా ఐదుగురు చనిపోయారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులూ, చంబా జిల్లాల్లో మెరుపు వరదలు వచ్చాయి. ఈ ఘటనలో ప్రాణనష్టం చోటుచేసుకోలేదు.

తెలంగాణలో భారీ వర్షాలు.. ఏ జిల్లాలో ఎంత వర్షపాతమంటే..?

ముంబై, థానే, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షపాతం నమోదవుతుందని ముంబై ప్రాంతీయ వాతావరణ కేంద్రం బుధవారం హెచ్చరిక జారీ చేసింది. జులై 10 వరకు ముంబై, థానేలలో ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించింది.మహారాష్ట్రలోని పలు నదులు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. కుండలికా నది హెచ్చరిక స్థాయిని దాటడంతో అంబా, సావిత్రి, పాతాళగంగ, ఉల్హాస్, గర్హి నదుల నీటిమట్టం హెచ్చరిక స్థాయి కంటే కాస్త తక్కువగా ఉంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్ని జిల్లాలను అప్రమత్తం చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అస్సాంలో వరదలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. ఆ రాష్ట్రంలోని అన్ని నదలు ప్రమాదస్థాయికి దిగువనే ప్రవహిస్తున్నాయి. ఇక్కడ వరదల కారణంగా 6లక్షలకు పైగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం పేర్కొంది.