మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో సమావేశం అయ్యారు. దీంతో మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో హుటాహుటినా ఢిల్లీకి వెళ్లి మోడీని కలిశారు. దీంతో ఫడ్నవిస్‌కు కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు అప్పగించవచ్చని కథనాలు వచ్చాయి. తాజాగా సోమవారం మరోసారి ప్రధాని మోడీని కలవడంతో ఆ ఊహాగానాలు మొదలయ్యాయి.
అయితే కేంద్ర కేబినెట్‌లోకి వెళ్లే అంశంపై ఫడ్నవిస్ క్లారిటీ ఇచ్చేశారు. అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. తనను మహారాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారని.. రాష్ట్ర బాధ్యతలు నెరవేర్చడమే తన ప్రాధాన్యత అని స్పష్టత ఇచ్చారు. ‘‘ఎవరైనా ఊహాగానాలు చేయాలనుకుంటే..ఎన్ని గాలిపటాలు ఎగరేయాలనుకుంటే అన్ని పుకార్లు వ్యాప్తి చేయాలనుకుంటే అలాగే చేయనివ్వండి. మహారాష్ట్ర ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. మా నాయకుడు నరేంద్ర మోడీ మహారాష్ట్ర బాధ్యతను నాకు అప్పగించారు. నేను ఈ బాధ్యతను నిర్వర్తిస్తూనే ఉంటాను.’’ అని స్పష్టం చేశారు.
ఏం చర్చించారంటే..
తాను మహారాష్ట్రలోని ముంబైలో ఉన్నానని.. మహారాష్ట్రలోనే ఉంటానని దేవేంద్ర ఫడ్నవిస్ స్పష్టంగా తెలిపారు. ఈ ప్రకటనతో కేంద్ర మంత్రిగా నియామకంపై జరుగుతున్న చర్చలకు తెరపడినట్లు కనిపిస్తోంది. తాను ఈరోజు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసినట్లు ఫడ్నవిస్ వెల్లడించారు. ఈ సమావేశం మహారాష్ట్రలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించడంతో పాటు రాబోయే ప్రాజెక్టుల గురించి కేంద్ర ప్రభుత్వంతో కూలంకషంగా చర్చించినట్లు వెల్లడించారు.
గ్రామీణాభివృద్ధి, ముంబై మెట్రో, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, రహదారుల నిర్మాణం వంటి మహారాష్ట్రకు సంబంధించిన అనేక ప్రధాన ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలిపారు. మహారాష్ట్రకు సాధ్యమైనంత సహాయం అందిస్తామని మోడీ హామీ ఇచ్చారు. తాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా కలిసినట్లు ఫడ్నవిస్ చెప్పారు. వేర్ కారిడార్ విషయంలో జపాన్‌కు చెందిన జైకా (JICA)తో కలిసి ముందుకు ఎలా పనిచేయాలనే దానిపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయన్నారు. మొత్తానికి ఊహాగానాలపై ఫడ్నవిస్ తెరదించారు.

