Site icon NTV Telugu

PM Modi: “వెనక నుంచి దాడి చేయడంపై నమ్మకం లేదు”.. బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్స్‌పై కీలక వ్యాఖ్యలు..

Pm Modi

Pm Modi

PM Modi: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ పాకిస్తాన్‌పై బాలాకోట్ వైమానిక దాడుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం బాగల్ కోట్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడిన ఆయన.. ‘‘వైమానిక దాడుల గురించి పాక్ అధికారులకు తెలియజేసిన తర్వాతే మీడియాకు ఫోన్ చేసి సమాచారాన్ని అందించాలని బలగాలను కోరాను, అయితే, వారు తన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేను బలగాలను వెచి ఉండాలని కోరాను, వారు ఫోన్ తీసుకున్న తర్వాత విషయాన్ని తెలియజేశాను. మోడీ వెనుక నుంచి దాడి చేయడాన్ని నమ్మడు. బహిరంగంగా పోరాడుతాడు’’ అని అన్నారు.

Read Also: Ap Elections: విజయనగరం టీడీపీ రెబల్ అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

ఎన్నికల్లో ఓడిపోతామనే ఆలోచనలో ఉన్న వ్యక్తులు టెక్నాలజీని ఉపయోగించి నకిలీ వీడియోలను తయారు చేస్తున్నారని ప్రధాని అన్నారు. ‘‘వారు ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు, సోషల్ మీడియాలో నా వాయిస్‌తో తప్పుడు విషయాలను చెబుతున్నారు. ఇది పెద్ద ముప్పును సృష్టస్తోంది’’ అని చెప్పారు. ఇలాంటి వీడియోలు వస్తే పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు తెలియజేయాలని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీ ఓటు మోడీని బలపరుస్తుందని, ఆపై దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని, దేశాన్ని తయారీ రంగానికి కేంద్రంగా, నైపుణ్య కేంద్రంగా తీర్చిదిద్దాలనేదే మా సంకల్పం అని మోడీ అన్నారు.

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం బెంగళూర్‌ని టెక్ హబ్ నుంచి ట్యాంకర్ హబ్‌గా మార్చారని, నగరంలో నెలకొన్న నీటి సంక్షోభాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ట్యాంకర్ మాఫియాకు ప్రభుత్వం సాయం చేసిందని దుయ్యబట్టారు. ట్యాంకర్ మాఫియా కాంగ్రెస్‌కి కమీషన్ చెల్లించిందని ఆయన పేర్కొన్నారు. ఈ ర్యాలీలో బీజేపీ నేత బీఎస్‌ యడియూరప్ప, బీజేపీ అభ్యర్థులు, బాగల్‌కోట్‌, విజయపుర ఎంపీలు పీసీ గడ్డిగౌడర్‌, రమేష్‌ జిగాజినాగి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version