MLA help to carry the dead body of the woman in odisha:శవాలు తరలించేందుకు కనీసం అంబులెన్సులు ఇవ్వని ప్రభుత్వాసుపత్రులు, సొంతూళ్లకు తమ తల్లుల శవాన్ని, కుమారుల శవాలను తీసుకెళ్లేందుకు బైకులను ఆశ్రయించిన ఘటనలను ఎన్నో చూశాం. చివరకు అనారోగ్యం పాలైన తమ బంధువులను తోపుడు బండ్లలో ప్రభుత్వాసుపత్రులకు తీసుకెళ్లిన ఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. అయితే ఓ ఎమ్మెల్యే మాత్రం.. ఓ కుటుంబానికి సాయం చేయడాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. తన భార్య మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు కనీసం డబ్బులు లేని ఓ వ్యక్తికి దగ్గరుండి వాహనం సదుపాయాన్ని ఏర్పాటు చేశాడు సదరు ఎమ్మెల్యే.
ఈ ఘటన ఒడిశా రాష్ట్రం గంజామ్ జిల్లాలో జరిగింది. గంజాం జిల్లా బెర్హంపూర్ లో చికిత్స పొందుతూ.. 30 ఏళ్ల మహిళ మరణించింది. అయితే మహిళ మృతదేహాన్ని తీసుకెళ్లడానికి బిజూ జనతాదళ్ (బీజేడీ) ఎమ్మెల్యే బిక్రమ్ కుమార్ పాండా సహాయం చేశారు. వివరాల్లోకి వెళితే.. కోరాపుట్ జిల్లాకు చెందిన రోజీ శాంతా అనే మహిళ ఇటీవల పురిటి నొప్పులతో కోరాపుట్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ నుంచి ఐదురోజుల క్రితం బెర్హంపూర్ మహారాజా కృష్ణ చంద్ర గజపతి మెడికల్ కాలేజీకి తరలించారు. చికిత్స పొందుతున్న క్రమంలో రోజీ శాంతా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి శుక్రవారం ఉదయం మరణించింది.
Read Also: Madhya Pradesh: తల గాయానికి “కండోమ్ ప్యాక్” తో డ్రెస్సింగ్..
కాగా అత్యంత దుర్భరమైన ఆర్థిక పరిస్థితి ఉన్న రోజీ శాంతా భర్త నరుల శాంత మృతదేహాన్ని 370 కిలోమీటర్ల దూరంలో ఉన్న సొంత గ్రామం బగ్దేరికి ఎలా తీసుకెళ్లాలని ఆందోళన చెందాడు. గంటల తరబడి ఆస్పత్రిలోనే మృతదేహం ఉంది. అయతే ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే బిక్రమ్ కుమార్ పాండా ఆస్పత్రికి చేరుకున్నారు. మృతదేహాన్ని తరలించేందుకు బెర్హంపూర్ మున్సిపల్ కార్పొరేషన్ వ్యాన్ ఏర్పాటు చేశారు. దాదాపుగా 370 కిలోమీటర్ల దూరంలో ఉన్న సొంతూరు వెళ్లడానికి దారి ఖర్చులను కూడా ఇచ్చి..పసికందుకు ఆహారం ఏర్పాటు చేశారు. నాలుగు శవాలను శ్మశాన వాటికకు తీసుకెళ్లడానికి తన ఎమ్మెల్యే నిధుల నుంచి విరాళం కూడా ఇచ్చారు బిక్రమ్ కుమార్ పాండా. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో కోవిడ్ వల్ల మరణించిన శవాలను తీసుకునేందుకు వారి బంధువులు ముందుకు రాకపోవడంతో ఎమ్మెల్యేనే దహనసంస్కారాలకు సహాయం చేశారు. ఓ ప్రజాప్రతినిధిగా ఇలా చేయడం తన కర్తవ్యం అని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే బిక్రమ్ కుమార్ పాండా.