Minister Narottam Mishra Counter To Arjun Kapoor: కొన్ని రోజుల నుంచి బాలీవుడ్‌లో ‘బాయ్‌కాట్ బాలీవుడ్’ ట్రెండ్ విపరీతంగా నడుస్తోంది. ఏదైతే విడుదలకి సిద్ధంగా ఉంటుందో, ఆ సినిమాని నిషేధించాలంటూ నెటిజన్లు నెట్టింట్లో తెగ ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం, గతంలో హిందువుల్ని కించపరిచేలా హీరోలు చేసిన వ్యాఖ్యలు, సినిమాల్లో చిత్రీకరించిన సన్నివేశాల్ని కారణంగా చూపుతూ.. మొత్తం బాలీవుడ్‌నే బాయ్‌కాట్ చేయాల్సిందిగా ఇంటర్నెట్‌లో పిలుపునిస్తున్నారు. ఈ ట్రెండ్ దెబ్బకు ‘లాల్ సింగ్ చడ్డా’, ‘రక్షా బంధన్’ చిత్రాలు బలి అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద కోట్లు కుమ్మరిస్తాయని అనుకుంటే, ఈ ట్రెండ్ దెబ్బకు ఆ చిత్రాలు కుప్పకూలాయి.
ఈ నేపథ్యంలోనే నటుడు అర్జున్ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుందని, ఇప్పటివరకూ దీనిపై మాట్లాడకుండా తాము తప్పు చేశామని, ఇప్పుడు కూడా మాట్లాడకపోతే బాలీవుడ్ మనుగడ కోల్పోతుందని అన్నాడు. తమ ప్రతిభను సినిమాలే చూపిస్తాయని నమ్మడం వల్లే తాము సైలెంట్‌గా ఉన్నామని.. తమ సహనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దంటూ ‘బాయ్‌కాట్ బాలీవుడ్’ని ట్రెండ్ చేస్తున్న వాళ్లను హెచ్చరించాడు. బాయ్‌కాట్ ట్రెండ్‌పై బాలీవుడ్ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చాడు. ఈ సమస్యకు మూలకారణం ఎక్కడుందో కనుక్కోవాలని సూచించడంతో పాటు.. ఇలాంటివి ట్రెండ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.
ఈ విధంగా అర్జున్ కపూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో.. మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందించారు. అర్జున్ కపూర్‌ను ఒక ఫ్లాప్ నటుడని పేర్కొన్న ఆయన.. జనాన్ని బెదిరించే కంటే, నీ నటనపై దృష్టి సారిస్తే బాగుంటుందని హితవు పలికారు. తమ చిత్రాల్లో హిందుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. టుక్డే టుక్డే గ్యాంగ్‌కు మద్దతు పలికేవారు ప్రజలను బెదిరించడం మానుకోవాలని హెచ్చరించారు. ఇలాంటి బెదిరింపుల్ని పక్కన పెట్టేసి, నీ పని నువ్వు చేసుకో అంటూ అర్జున్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.