MIM is giving biryani dinners to increase party strength in madhya pradesh: హైదరాబాద్ కేంద్రంగా ఏర్పడిన ఎంఐఎం పార్టీ ఇతర రాష్ట్రాల్లో కూడా తమ బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాల్లో సత్తా చాటింది. ఈ రాష్ట్రాల్లో ఎంఐఎంకు బలమైన ఓటు బ్యాంకు ఉంది. ముఖ్యంగా మైనారిటీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎంఐఎం ఇతర పార్టీలకు సవాల్ విసురుతోంది. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ లో కూడా తమ బలాన్ని పెంచుకునేందుకు ఎంఐఎం ప్రయత్నిస్తోంది. 2023లో మధ్యప్రదేశ్ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. దీని కోసం పక్కా ప్లానింగ్ తో ముందుకు పోతోంది.
పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికలు ఉండే రాష్ట్రాల్లో తరుచుగా పర్యటిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో పాగా వేసేందుకు కష్టపడుతున్నారు. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ భోపాల్ ప్రాంతంలో పార్టీ బలం పెంచుకునేందుకు వినూత్న ప్రచారాన్ని మొదలుపెట్టింది. పార్టీలోకి మరింత మందిని ఆకర్షించేందుకు బిర్యానీ ఫెస్ట్ లను నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీకి లక్ష మందికి పైగా సభ్యత్వాలు ఉన్నాయి.
Read Also: T20 Cricket : భారత్ – పాక్ మ్యాచ్ పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
నరేలా సీటు నుంచి పోటీ చేస్తున్న ఎంఐఎం నాయకుడు ఫీర్జాద తౌకిర్ నిజామా మాట్లాడుతూ.. అతిథి దేవో భవలో భాగంగా రుచికరమైన బిర్యానీ అందిస్తున్నామని.. నరేలాలో 25 వేలకు పైగా ప్రజలు పార్టీలో చేరారని అన్నారు. భోపాల్ లోని నరేలా ప్రాంతంలో 40 శాాతం ముస్లిం వర్గానికి చెందిన వారు ఉన్నారు. వీరిలో 25 వేల మంది పార్టీలో ఉన్నారని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నాటికి సభ్యత్వాలను 10 లక్షల పైగా చేయడాన్ని ఎంఐఎం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలో ఓవైసీ తర్వాత హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ అని ఆయన అన్నారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం సవాల్ విసురుతోంది. గత స్థానిక ఎన్నికల్లో ఎంఐఎం వల్ల కాంగ్రెస్ పార్టీ భారీగా నష్టపోయింది. 2023 మధ్యప్రదేశ్ ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేసేందుకు ఎంఐఎం పార్టీ సిద్ధం అవుతోంది. జబల్ పూర్, ఖాండ్వా, ఖర్గోన్, బుర్హాన్ పూర్, భోపాల్, ఇండోర్ వంటి నగరాల్లో పోటీ చేయనుంది. గతంలో జరిగిన పట్టణ సంస్థల ఎన్నికల్లో 7 కౌన్సిలర్ స్థానాలను గెలిచింది.
