Operation Sindoor: దేశ భద్రతకు కేవలం ఆర్థిక బలమే సరిపోదని, బలమైన సైనిక శక్తి తప్పనిసరి అని భారత వైమానిక దళ చీఫ్(IAF) చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన 22వ సుబ్రతో ముఖర్జీ సెమినార్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే కాకుండా, పాకిస్తాన్‌పై భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ దాడులను గురించి ప్రస్తావించారు. ఆధునిక యుద్ధాల్లో ‘‘ఎయిర్ పవర్’’ చాలా కీలకమని అన్నారు. పాకిస్తాన్‌పై దాడుల్లో భారత వైమానిక దళం వేగవంతమైన, నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకునే సామర్థ్యాన్ని నిరూపించిందని ఆయన అన్నారు. సిందూర్ సమయంలో భారత వైమానిక దళం పాకిస్తాన్‌కు స్పష్టమైన సందేశాన్ని పంపిందని ఆయన చెప్పారు.
Read Also: Crime: పెళ్లై 4 నెలలు.. ఇద్దరు వ్యక్తులతో భార్య రాసలీలలు.. భర్త ఏం చేశాడంటే..
సుడాన్‌లో సంఘర్షణ ప్రాంతాల నుంచి ప్రజల్ని తరలించడం, ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం, శత్రువుల్ని లొంగదీసుకోవడానికి కొన్ని గంటల్లోనే పాకిస్తాన్‌లోని అనేక స్థావరాలపై దాడి చేయడం వంటివి వైమానిక దళం చేసిందనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని అన్నారు. ఇటీవల వెనిజులా, ఇరాక్ పరిస్థితుల్ని ఉదహరిస్తూ.. కేవలం ఆర్థిక బలం మాత్రమే జాతీయ భద్రతకు హామీ ఇవ్వదని, పటిష్టమైన సైన్యం కూడా అవసరమే అని చెప్పారు. దీనికి ఉదాహరణను చెబుతు.. ఒకప్పుడు భారత్, చైనాలు ప్రపంచంలో 60 శాతం జీడీపీపి కలిగి ఉన్నామని, కానీ వలస పాలనలోకి వెళ్లకుండా నిలువరించలేకపోయామని అన్నారు. పటిష్టమైన సైన్యం లేకపోతే మనల్ని ఎవరైనా లొంగదీసుకోవచ్చని, సైనిక శక్తిని ఉపయోగించాలనే సంకల్పం అంతకన్నా ముఖ్యమైందని ఆయన అన్నారు.
