NTV Telugu Site icon

Meta: “మెటా”కి పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు.. జుకర్‌బర్గ్ వ్యాఖ్యలపై భారత్ ఫైర్..

Meta

Meta

Meta: 2024 భారత సార్వత్రిక ఎన్నికలపై ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. జనవరి 10న న్యూఢిల్లీలో జరిగిన జో రోగన్ పాడ్‌కాస్ట్‌లో ఆయన పాల్గొన్నారు. జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలపై మెటాకి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు జారీ చేయనుంది. తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేసినందుకు మెటాకు సమన్లు జారీ చేస్తామని బీజేపీ ఎంపీ, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై హౌస్ ప్యానెల్ చైర్మన్ నిషికాంత్ దూబే తెలిపారు.

Read Also: Jammu Kashmir: భారత్-పాక్ సరిహద్దుల్లో మందుపాతర పేలుడు..ఆరుగురు జవాన్లకు గాయాలు..

‘‘ఒక ప్రజాస్వామ్య దేశం గురించి తప్పుడు సమాచారం దాని ప్రతిష్టని దిగజార్చుతుంది. ఈ తప్పుకు ఆ సంస్థ పార్లమెంట్‌కి, ఇక్కడి ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సి ఉంటుంది’’ అని దూబే ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

ఈ పాడ్‌కాస్ట్‌లో జుకర్‌బర్గ్ మాట్లాడుతూ.. గతేడాది భారత్ సహా ప్రపంచంలో అనేక దేశాల్లో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓటమి చెందాయని చెప్పారు. అయితే, ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తోసిపుచ్చారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌లో ఎన్డీయేని ప్రజలు మూడోసారి గెలిపించిన విషయాన్ని గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో 64 కోట్ల మంది ఓటర్లు ఓటేసినట్లు చెప్పారు. కోవిడ్ తర్వాత భారత్ సహా అనేక దేశాల్లో ప్రభుత్వాలు ఓడిపోయాయని జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని ఆయన చెప్పారు. కోవిడ్ సమయంలో 80 కోట్ల మందికి ఉచిత ఆహారం, 2.2 బిలియన్ల ఉచిత వ్యాక్సిన్లను అందించిన దేశంగా భారత్ నిలిచిందని గుర్తు చేశారు.