Messi row: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్‌కతా పర్యటన ఆ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కోల్‌కతాలో మెస్సీ పర్యటనలో వైఫల్యం అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో సంచలనంగా మారింది. విపక్షాల నుంచి సాధారణ ప్రజల వరకు ప్రభుత్వం, అధికారుల తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి అరూప్ బిశ్వాస్ రాజీనామా లేఖను సీఎం మమతా బెనర్జీకి పంపారు. దీనిని ఆమె ఆమోదించారు. ఈ ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు జరిగేలా చూసేందుకు రాజీనామా చేస్తున్నట్లు బిశ్వాస్ చెప్పారు. ప్రస్తుతం ఈ శాఖను సీఎం మమతా బెనర్జీ చూడనుంది.
Read Also: Rupee vs Dollar: డాలర్‌తో పోల్చితే రికార్డు స్థాయిలో రూపాయి పతనం.. కారణాలు ఇవే!
శనివారం కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ పర్యటన సందర్భంగా తీవ్ర గందరగోళం, హింస తెలెత్తింది. మెస్సీ G.O.A.T ఇండియా పర్యటనలో భాగంగా కోల్‌కతా వచ్చిన సందర్భంలో, సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడంతో పాటు మెస్సీ చుట్టూ అధికారులు, రాజకీయ నాయకులు గుమిగూడటంపై అభిమానులు, సాధారణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహంతో ఉన్న ప్రేక్షకులు స్టేడియంలోకి వాటర్ బాటిళ్లు, టెంట్లు విసిరేశారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర క్రీడా మంత్రి రాజీనామా చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ రాజీవ్ కుమార్, బిధాన్ నగర్ పోలీస్ కమిషనర్ ముఖేష్ కుమార్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అన్నేష్ సర్కార్, క్రీడలు మరియు యువజన వ్యవహారాల ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేష్ సిన్హాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడుగా భావించే క్రీడా శాఖ మంత్రి అరూప్ బిశ్వాస్, మెస్సీ పర్యనటలో, మెస్సీ చుట్టూ ఉంటూ అతడి కుటుంబ సభ్యులతో ఫోటోలు తీయించారని అభిమానులు ఆరోపించారు. తాము వేల రూపాయలతో టికెట్ కొని స్టేడియానికి వస్తే కనీసం మెన్సీని చూడనీయకుండా చేశారని అన్నారు. ఈ ఘటనపై ప్రేక్షకులకు మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. నిర్వహణ లోపాలతో తీవ్రంగా కలత చెందానని, దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు.