వామ్మో.. మీరట్‌లో మరో దారుణం వెలుగుచూసింది. మొన్నటికి మొన్న భర్తను ప్రియుడి సాయంతో అత్యంత దారుణంగా చంపేసి.. అనంతరం ముక్కలు.. ముక్కలు చేసి ప్లాస్టిక్ డ్రమ్ములో సిమెంట్‌తో కప్పేశారు. ఈ దారుణాన్ని ఇంకా మరువక ముందే మరో ఘోరం మీరట్‌లో వెలుగుచూసింది.
అమిత్-రవిత భార్యాభర్తలు. అమిత్ రోజువారీ కూలి. మీరట్‌లోని భైంసుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్బర్‌పూర్ సదత్ గ్రామంలో నివాసం ఉంటారు. 2 రోజుల క్రితం అమిత్ శవమై కనిపించాడు. పాము కాటుతో చనిపోయినట్లు వీడియోలు వైరల్ అయ్యాయి. బాధితుడ్ని ఆస్పత్రికి తరలించగా వైద్యులు చనిపోయినట్లుగా నిర్ధారించారు. దీంతో డాక్టర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఇందుకు సంబంధించిన రిపోర్టు బుధవారం పోలీసులకు అందింది. ఈ రిపోర్టులో పాము కాటుతో గానీ.. విషంతో గానీ చనిపోయినట్లుగా నిర్ధారణ కాలేదు. గొంతు పిసికి చంపినట్లుగా రిపోర్టులో తేలింది. దీంతో పోలీసులు రవితను అదుపులోకి తీసుకోగా.. వివాహేతర సంబంధం వెలుగులోకి వచ్చింది. ప్రియుడి సాయంతో భర్తను చంపినట్లుగా నేరాన్ని అంగీకరించింది. దీంతో ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.
ఏడాది నుంచి అమర్జీత్ అనే యువకుడితో రవిత వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ వ్యవహారం తెలిసిన అమిత్.. రవితతో గొడవలు జరుగుతున్నాయి. దీంతో అమిత్‌ను చంపేయాలని రవిత-అమర్జీత్ కుట్ర పన్నారు. అయితే తాము చంపినట్లుగా బయటకు తెలియకూడదని పక్కా ప్రణాళిక రచించారు. అమిత్ మంచంపై చనిపోయి ఉన్నాడు. మంచం దగ్గర పాము కనిపించింది. అయితే పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని పరిశీలించగా మంచంపై పాము ఉండడంతో పాము కాటుతో చనిపోయినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అమిత్‌ను గొంతు కోసి చంపిన తర్వాత ప్రేమికులిద్దరూ ఉపాయం పన్ని పాము కాటుతో చనిపోయినట్లుగా ప్రణాళిక వేసుకున్నట్లుగా తెలిపారు. ఇందుకోసం సమీప ప్రాంతం నుంచి రూ.1,000కు పామును కొనుగోలు చేసినట్లుగా చెప్పారు. అమిత్‌ను చంపి అనంతరం పాము కారణంగా చనిపోయినట్లుగా అతడి శరీరం మీద పామును ఉంచారని వెల్లడించారు. మరుసటి రోజు పామును పట్టుకునే వ్యక్తిని పిలిచి.. మర్డర్‌ను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. పాము కారణంగానే తన భర్త చనిపోయినట్లుగా రవిత గ్రామస్తులందరినీ నమ్మించిందని.. ఇదంతా ప్రణాళికలో ఒక భాగమని తెలిపారు. పాముకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కూడా తెగవైరల్ అయ్యాయి. ఇక ఈ హత్యలో ఇంకెవరైనా పాల్గొన్నారా? అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పాము దృశ్యాలను ప్రేమికుడే రికార్డ్ చేసినట్లుగా గుర్తించారు.
