Site icon NTV Telugu

Maulana Mahmood Madani: ముస్లింలను అవమానిస్తున్నారు.. “జిహాద్‌”పై జమియత్ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు..

Maulana Mahmood Madani

Maulana Mahmood Madani

Maulana Mahmood Madani: జమియత్ ఉలేమా-ఎ-హింద్ చీఫ్ మౌలానా మహమూద్ మదాని మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు, ట్రిపుల్ తలాక్, జ్ఞాన్‌వాపి-కాశీ వంటి కేసులతో సుప్రీం, హైకోర్టులపై ప్రభుత్వాలు ఒత్తిడిని పెంచుతున్నాయని ఆరోపించారు. బాబ్రీ మసీదు తీర్పు తర్వాత, ట్రిపుల్ తలాక్, ఇప్పుడు 1991 ప్రార్థనా స్థలాల చట్టాన్ని కూడా కోర్టుల్లో సవాల్ చేస్తున్నారని ఆయన అన్నారు. మసీదులు, దర్గాలనను సర్వే చేసి, హక్కులు పొందుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగంలో మైనారిటీలకు ఇచ్చే హక్కులను బహిరంగంగా ఉల్లంఘిస్తున్నారని మదానీ అన్నారు.

Read Also: Australian PM Wedding: 62 ఏళ్ల వయసులో ప్రేమ వివాహం.. ప్రధాని జీవితంలో సరికొత్త అధ్యాయం..

మదానీ 1991 ప్రార్థనా స్థలాల చట్టాన్ని ప్రస్తావించారు. ఈ చట్టం ప్రకారం ఆగస్టు 15, 1947న ఉన్న మతపరమైన కట్టడం లక్షణాన్ని మార్చవద్దని, దాని స్థితిలో మార్పు చేయలేము అని చెబుతుంది. మదానీ మాట్లాడుతూ.. ఈ చట్టం బాబ్రీ మసీదు మినహా అన్ని మతపరమైన ప్రదేశాలను రక్షిస్తుందని, కానీ నేడు జ్ఞాన్‌వాపి, మధురలోని షాహి ఈద్గా, అజ్మీర్ షరీఫ్ దర్గా, సంభాల్‌లోని జామా మసీదు వంటి ప్రదేశాలలో సర్వేలు నిర్వహిస్తున్నారని, ఇది చట్టాన్ని ఉల్లంఘించడమే అని అన్నారు. ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ, ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటున్నారని, హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, పార్సీలు విడాకుల తర్వాత జైలుకు వెళ్లరు, కానీ ముస్లింలు మాత్రమే జైలుకు వెళ్తారని అన్నారు.

అంతేకాకుండా, అణచివేత ఉన్నంత వరకు జిహాద్ ఉంటుందని ఆయన అన్నారు. లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, స్పిట్ జిహాద్ వంటి పదాలు ద్వారా ముస్లింలను అవమానిస్తున్నారని, ఇస్లాం శత్రువులు జిహాద్‌ను హింసకు పర్యాయపదంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇస్లాంలో, జిహాద్ ముస్లింలకు పవిత్ర విధి అని చెప్పారు. అయితే, మదానీ వ్యాఖ్యలపై బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి రజనీష్ అగర్వాల్ స్పందిస్తూ.. సుప్రీంకోర్టు పురావస్తు ఆధారాల ఆధారంగా బాబ్రీ మసీదు తీర్పు ఇచ్చిందని, జ్ఞానవాపి, ఇతర కేసులలో, కోర్టు సర్వేకు మాత్రమే అనుమతించిందని, నిర్ణయం తీసుకోలేదని, మదానీ కోర్టుల్ని విశ్వసించాలని, రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు.

Exit mobile version