NTV Telugu Site icon

Dating App Scams: డేట్ అని అమ్మాయిని కలవడానికి వెళ్లారో, జేబు ఖాళీ.. వెలుగులోకి “డేటింగ్ స్కామ్”..

Dating App Scams

Dating App Scams

Dating App Scams: ఇటీవల ఢిల్లీలో ఓ సివిల్ సర్వీస్ ఔత్సాహికడు డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన మహిళతో డేటింగ్ వెళ్తే ఓ కేఫ్‌లో రూ. 1.20 లక్షల బిల్లు చెల్లించాల్సి వచ్చింది. ‘టిండర్ స్కామ్’కి సంబంధించి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. చాలా మంది తాము డేటింగ్ యాప్‌లో ఉన్నామని తెలిస్తే పరువుపోతుందనే భయంతో చాలా కేసులు వెలుగులోకి రావడం లేదు. దీంతోనే కొందరు ఇలా స్కామ్ చేసి డబ్బును దండుకుంటున్నారు. రెడ్డిట్‌లో అనేక పోస్టులు తమకు జరిగిన అనుభవాలను పంచుకుంటున్నారు.

Tinder, Bumble, Hinge మరియు OKCupid వంటి డేటింగ్ యాప్‌లో బాధితుడు మహిళతో మ్యాచ్ అవుతుంటాడు. వెంటనే సదరు యువతి వాట్సాప్ నంబర్‌ని షేర్ చేస్తుంది. ఆ తర్వాత వీరిద్దరు మాట్లాడుకుంటారు. అయితే డేట్‌కి ఓ రోజు ఫిక్స్ చేసుకుంటారు. యువతి బాధితుడైన వ్యక్తిని ఒక నిర్ధిష్ట ప్రదేశానికి రావాలని కోరుతుంది. అక్కడ పబ్ లేదా కేఫ్‌కి ఇద్దరు వెళ్తారు. కేఫ్‌లో యువతి ఆర్డర్ ఇస్తుంది. డేట్‌ ఆతృతతో అతను ఎలాంటి అనుమానాన్ని వ్యక్తం చేయడు. మెనూలోని ఫుడ్ ఆర్డర్ చేస్తుంది. ఆ తర్వాత అర్జెంట్‌గా బయటకు వెళ్లాలని చెప్పి అక్కడ నుంచి జారుకుంటుంది. అయితే, బిల్లు వచ్చినప్పుడు అసలు విషయం బాధితుడికి అర్థం అవుతుంది. తాను అంచనా వేసినదాని కన్నా ఎక్కువ బిల్లు వచ్చినట్లు గుర్తిస్తాడు. కొన్ని సందర్భాల్లో బిల్ గురించి సంబంధిత నిర్వాహకులతో వాగ్వాదానికి దిగితే, బౌన్సర్లతో బెదిరించి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తారు. ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నా పోలీసుల వద్దకు కంఫ్లైట్ రాదు. ఎందుకంటే డేటింగ్ యాప్‌లో మహిళల్ని కలుస్తున్నాడనే విషయం తమకు కుటుంబంలో తెలిస్తే బాగుండదనే భయంతో ఎవరూ ఎలాంటి ఫిర్యాలు చేయడం లేదు.

Read Also: Kalki 2898 AD Collections: బాక్సాఫీస్‌పై కల్కి దండయాత్ర.. 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

ఐఏఎస్ కావాలనే ఔత్సాహికుడిని ఇలాగే టార్గెట్ చేసి దోచిన ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ పోలీసులు కేఫ్ యామాని అక్షయ్ పహ్వా, డేటింగ్‌కి పిలిచిన యువతి అఫ్సాన్ పర్వీన్‌లను అరెస్ట్ చేశారు. కేఫ్ యజమానులు, నిర్వాహకులు అందరూ ఈ స్కామ్‌లో ఉన్నారు. బాధితుడి నుంచి స్కామ్ చేసి దోచుకున్న డబ్బులో తలా ఇంత అని పంచుకుంటారు. బిల్లులో 15 శాతం మహిళకు వెళ్తే, 45 శాతం మేనేజర్, 40 శాతం పబ్ లేదా కేఫ్ యజమానులకు వెళ్తుంది.

ఒక్క ఢిల్లీ మాత్రమే కాదు ముంబై, బెంగళూర్, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో ఈ కుంభకోణం జరుగుతోంది. ఈ నెల ప్రారంభంలో యాక్టివిస్ట్ దీపికా నారాయణ్ భరద్వాజ్ హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఇలాంటి రాకెట్ గురించి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఒకే క్లబ్ మూడు వేర్వేరు పేర్లతో పనిచేస్తుందని, ఒకే మహిళ డేటింగ్ యాప్‌లలో పలువురిని ఆకర్షించి పబ్‌కి రప్పించి బాధితులను మోసం చేస్తున్నట్లు వెల్లడైంది. బాధితుడు బిల్లు రూ. 20,000 కంటే ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇది రూ. 40,000 వరకు ఉంటుంది.

ఒక్క పురుషులే కాదు, స్త్రీలను కూడా టార్గెట్ చేస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో డేటింగ్ యాప్‌లో మహిళతో ఫ్రెండ్‌షిప్ చేసి వారి ఇంటిని దోచుకున్న ఇద్దరు వ్యక్తుల్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను విజయ్ కుమార్ కమల్ (28), రాహుల్ (35)గా పోలీసులు గుర్తించారు. డేటింగ్ యాప్‌లో తనను జతిన్ అని పరిచయం చేసుకున్న వ్యక్తి తన ఇంట్లో దోచుకున్నాడని 35 ఏళ్ల మహిళ మే 31న ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని సీనియర్ పోలీసు అధికారి అంకిత్ సింగ్ తెలిపారు. మే 30న రాహుల్ తన ఇంటికి వెళ్లే ముందు తాను, జతిన్ (విజయ్ కుమార్ కమల్)తో కలిసి మెసేజ్‌ల ద్వారా మాట్లాడుకునేవారని బాధితురాలు పోలీసులకు తెలిపింది. “ఇద్దరూ ఆమె బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్ మరియు రూ. 5,000 నగదును దోచుకుని పారిపోయారని అధికారి తెలిపారు.