Site icon NTV Telugu

Madhyapradesh: మధ్యప్రదేశ్‌ సీఎం కనుసన్నల్లో భారీ స్కాం.. పిల్లల ఆహార పథకంలో గోల్‌మాల్‌!

Madhyapradesh

Madhyapradesh

Madhyapradesh: మధ్యప్రదేశ్ సర్కారు చేపట్టిన పోషకాహార పథకంలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. స్కూల్‌ పిల్లల ఆహార పథకంలో భారీగా గోల్‌మాల్‌ జరిగింది. సీఎం శివరాజ్ సింగ్‌ చౌహాన్‌ పర్యవేక్షణలో ఉన్న మహిళా, శిశు అభివృద్ధి శాఖలో భారీ ఎత్తున అవినీతి జరిగినట్లు మధ్యప్రదేశ్‌ అకౌంటెంట్ జనరల్ గుర్తించింది. రేషన్‌ సరుకులను తరలించేందుకు వినియోగించిన ట్రక్కుల నంబర్లు బైకులుగా తేలటం నుంచి.. లబ్ధిదారుల వాస్తవానికి దూరంగా ఉండటం వరకు భారీ స్థాయిలో అవినీతి వెలుగులోకి వచ్చింది. ఈ స్కాంతో చిన్నారులు, మహిళలు పోషకాహారలోపానికి గురికావటంతో పాటు పన్ను చెల్లింపుదారుల కోట్లాది రూపాయలు అవినీతిపరుల చేతిలోకి వెళ్లినట్లు రాష్ట్ర ఆడిటర్‌ గుర్తించారు.

పాఠశాల చిన్నారులకు ఉచిత ఆహారం పథకంలో అవినీతి జరిగినట్లు మధ్యప్రదేశ్‌ అకౌంటెంట్‌ జనరల్‌ రూపొందించిన 36 పేజీల నివేదికలోని పలు అంశాలు బయటకు రావటం మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంలో అలజడి సృష్టిస్తోంది. పిల్లలు, మహిళల పౌష్ఠికాహారం కోసం మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టేక్‌ హోం రేషన్‌ పథకంలో భారీ ఎత్తున అవినీతి జరిగినట్లు అందులో పేర్కొంది. 2021కి సంబంధించిన టేక్ హోమ్ రేషన్ పథకంలో దాదాపు 24 శాతం మంది లబ్ధిదారుల వివరాలను పరిశీలించినట్లు నివేదిక తెలిపింది. ఈ పథకం ద్వారా 34.69 లక్షల మంది 6 నెలల నుంచి 3 ఏళ్లలోపు పిల్లలు, 14.25 లక్షల గర్భిణీ మహిళలు, పాలిచ్చే తల్లులు, 0.64 లక్షల మంది పాఠశాల మానేసిన బాలికలకు పోషకాహారం అందించారు.

పోషకాహార పథకంలో భాగంగా వివిధ ఉత్పత్తి ప్లాంట్ల నుంచి సుమారు 1,125.64 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ సరుకులను సరఫరా చేశారు. రవాణా కోసం ట్రక్కులకు రూ.6.94 కోట్లు ఖర్చు చేశారు. అయితే, ట్రక్కులుగా లెక్కలో చూపిన వాహనాలు బైకులు, కార్లు, ఆటోలు, ట్యాంకర్లుగా రిజిస్ట్రేషన్‌ అయి ఉన్నాయి. దీంతో సరుకుల రవాణాలోనే కోట్లాది రూపాయలు దారిమళ్లినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ ఆడిట్‌ నివేదిక ప్రకారం స్కూల్‌ పిల్లలకు ఉచిత ఆహార పంపిణీ పథకంలో లబ్ధిదారుల సంఖ్య, ఆహారం ఉత్పత్తి, నాణ్యత, పంపిణీలో భారీగా అవకతవకలు జరిగాయి. 2018లో కేవలం 9 వేలు ఉన్న లబ్ధిదారుల సంఖ్య 2021 నాటికి ఏకంగా 36.08 లక్షలకు పెరిగింది. ఉచిత రేషన్‌కు అర్హులైన స్కూల్‌ బాలికలను 2018 ఏప్రిల్‌ నాటికి గుర్తించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించినా ఆ రాష్ట్ర మహిళా, పిల్లల అభివృద్ధి శాఖ (డబ్ల్యూసీడీ) పట్టించుకోలేదు. 2018-19లో అర్హులైన 11-14 ఏళ్ల బాలికల సంఖ్య 9,000గా ఆ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అంచనా వేసింది. అయితే ఎలాంటి సర్వే నిర్వహించకుండానే లబ్ధిదారుల సంఖ్య 36.08 లక్షలుగా మహిళా, పిల్లల అభివృద్ధి శాఖ పేర్కొంది.

JDU: 2024 ఎన్నికల్లో బీజేపీకి 2 సీట్లే.. ఎక్కడ మొదలుపెట్టారో అక్కడికే..

కాగా, 8 జిల్లాల పరిధిలోని 49 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆడిట్‌ నిర్వహించగా కేవలం మూడు జిల్లాలోనే రేషన్‌ పొందుతున్న స్కూల్‌ బాలికల నమోదును గుర్తించారు. అయితే 2018-21లో 63,748 మంది బాలికలను జాబితాలో చేర్చి 29,102 మందికి సహాయం చేసినట్లుగా డబ్ల్యూసీడీ పేర్కొంది. ఈ నేపథ్యంలో డాటా మానిప్యులేషన్‌ ద్వారా రూ.110.83 కోట్ల విలువైన రేషన్ పక్కదారి పట్టినట్లు ఆడిట్‌లో తేలింది. అలాగే రేషన్‌ ఉత్పత్తిలో రూ.58 కోట్ల మేర అవినీతి జరిగినట్లు వెలుగుచూసింది. రూ.62.72 కోట్ల విలువైన 10,000 మెట్రిక్ టన్నులకుపైగా రేషన్‌ సరుకులు అసలు రవాణా కాలేదు. గోదాముల్లో కూడా లేని ఈ సరుకులు మాయం అయినట్లు బయటపడింది.

Exit mobile version