Masood Azhar: భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌కు భారత అధికారులంటే ఎలాంటి భయమో స్వయంగా ఆయనే వెల్లడించాడు. 1990లలో జమ్మూ కాశ్మీర్ జైలులో ఉన్న అజర్, అక్కడి నుంచి తప్పించుకునేందుకు విఫలయత్నం చేశారు. దీని తర్వాత తాను తీవ్రమైన ‘‘శిక్ష’’ను ఎదుర్కొన్నానని చెబుతున్న ఆడియో క్లిప్ ఒకటి వెలుగులోకి వచ్చింది. నిఘా వర్గాలు కూడా ఈ ఆడియో క్లిప్ నిజమైందని నిర్ధారించాయి. పాకిస్తాన్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో అజర్ ప్రసంగిస్తూ, జైలులో ఉన్న అప్పటి గతాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.
మసూర్ అజర్ 1994లో నకిలీ గుర్తింపు, పోర్చగీస్ పాస్‌పోర్ట్ ద్వారా భారత్‌లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పెంచడం,జిహాద్‌ను ప్రోత్సహించాలని వచ్చాడు. అదే ఏడాది అనంత్‌నాగ్‌లో అరెస్ట్ అయ్యాడు. 1994 నుంచి 1999 వరకు జైలు ఉన్నాడు. ఆ సమయంలో జమ్మూ లోని కోట్ భల్వాల్ జైలులో ఉన్నాడు. ఇది కరుగుగట్టిన ఉగ్రవాదుల్ని ఉంచే జైలు. జైలులో దొరికిన కొన్ని పనిముట్లను వాడి సొరంగం తవ్వి పారిపోవాలనే పథకాన్ని వేశాడు. కానీ తప్పించుకోవాలని నిర్ణయించుకున్న రోజే జైలు అధికారులు సొరంగాన్ని గుర్తించారు.
అధికారులకు పట్టుబడిన తర్వాత.. తనను , ఇతర ఉగ్రవాద ఖైదీలను జైలు అధికారులు తీవ్రంగా కొట్టారని ఆడియోలో అజర్ చెప్పాడు. గొలుసులతో కొట్టడంతో పాటు ,రోజూ వారీ కార్యకలాపాలపై నిఘా ఉండేదని వెల్లడించారు. ఈ ఘటన తనను మానసికంగా పూర్తిగా కుంగదీసిందని, ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు తనను భయపెడతాయని చెప్పాడు.
ఐసీ-814 హైజాకింగ్ తర్వాత విడుదల:
1999లో ఖాట్మాండు నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం IC-814 హైజాకింగ్ సమయంలో భారత ప్రయాణికుల్ని కాపాడేందుకు అప్పటి వాజ్‌పేయి సర్కార్ మసూద్ అజర్‌ను విడుదల చేసింది. విడుదలైన తర్వాత జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేశాడు. 2001లో భారత పార్లమెంట్‌పై దాడి, 2008 ముంబై టెర్రర్ దాడులకు ఇతనే ప్రధాన సూత్రధారి. ఈ ఏడాది పహల్గామ్ దాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ‘‘ఆపరేషన్ సిందూర్’’లో మసూద్ అజార్ జైషే కార్యాలయాన్ని ధ్వంసం చేశాము. ఈ దాడిలో అజర్ కుటుంబంలో కనీసం 10 మంది మరణించారు. బహవల్పూర్‌లోని జైషే హెడ్ ఆఫీస్ తీవ్రంగా దెబ్బతింది.
