Maoists: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు నకిలీ కరెన్సీని ముద్రిస్తున్నారా..? అంటే ఔననే సమాధానాలే వినిపిస్తు్న్నాయి. తాజాగా భద్రతా బలగాలు జరిపిన ఆపరేషన్‌లో ఇందుకు సంబంధించిన సామాగ్రి పట్టుబడటం కలకలం రేపింది. ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌లో నకిలీ కరెన్సీని ముద్రించేందుకు ఉపయోగించే పరికరాలను తొలిసారిగా భద్రతా బలగాలు కనిపెట్టాయి. స్థానిక మార్కెట్లో ఈ విషయం ప్రభావం చూపిస్తుందని ఆందోలన వ్యక్తం చేశారు.
Read Also: Police: మహిళా కానిస్టేబుల్‌తో హోటల్ గదిలో పట్టుబడిన డీఎస్పీ.. కానిస్టేబుల్‌గా డిమోషన్..
కొరాజ్‌గూడ అడవుల్లో సుక్మా పోలీసుల, జిల్లా రిజర్వ్ గార్డ్, సీఆర్పీఎఫ్ జరిపిన సెర్చ్ ఆపరేషన్‌లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మావోయిస్టులు అడవుల్లో నకిలీ కరెన్సీని ముద్రిస్తున్నారనే నిఘా సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ జరిగింది. మావోయిస్టులు తప్పించుకున్నప్పటికీ, భద్రతా దళాలు కరెన్సీ ప్రింటింగ్ మిషన్లు, ఇంక్, టెంప్లేట్లతో పాటు రూ.50, రూ. 100, రూ. 200, రూ.500 విలువ కలిగిన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. తుపాకీ, వైర్‌లెస్ సెట్, భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు లభించాయి.
ఇటీవల కాలంలో దండకారణ్యంలో భద్రతా కార్యకలాపాలు ఎక్కువ కావడంతో మావోయిస్టులు నగదు కొరతను ఎదుర్కొంటున్నట్లు అనుమానిస్తు్న్నారు. దీంతోనే వారు నకిలీ కరెన్సీని ముద్రించాల్సి వస్తోందని జిల్లా పోలీస్ చీఫ్ కిరణ్ చవాన్ వివరించారు. మావోయిస్టులు తరుచుగా వారసంత, గ్రామాల్లోని మార్కెట్లలో సామాగ్రిని కొనుగోలు చేస్తారు. వీటిలో నకిలీ కరెన్సీని ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇది స్థానిక మార్కెట్లను అస్థిరపరచొచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని వారు అప్రమత్తంగా ఉండాలని, నకిలీ కరెన్సీని తిరస్కరించాలని అధికారులు కోరారు. 2022 నుంచి మావోలు నగదు కొరతను తీర్చుకునేందుకు కరెన్సీని ముద్రిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్ ఉన్నాయి. ప్రతీ ఏరియా కమిటీలో ఒక సభ్యుడు నకిలీ కరెన్సీని ముద్రించేలా శిక్షణ పొందారని తెలుస్తోంది.