Manish Sisodia’s comments on buying TRS MLAs: తెలంగాణలో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. బీజేపీ అడ్డగోలుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్పందించారు. దేశంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆపరేషన్ లోటస్ పేరుతో వికృత క్రీడ నడుస్తోందని ఆయన అన్నారు. తెలంగాణలో ఆపరేషన్ లోటస్ బట్టబయలైందని అన్నారు. ప్రజల ఓట్లతో ఎన్నికైన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని చూస్తోందని విమర్శించారు.
హైదరాబాద్ లో బీజేపీ కోసం ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే దళారి వ్యవహారం వెలుగులోకి వచ్చిందని సిసోడియా అన్నారు. రూ. 100 కోట్లతో ముగ్గురు దళారులు రెడ్ హ్యాండెడ్ గా దొరికారని అన్నారు. ఆపరేషన్ లోటస్ పేరుతో ముగ్గురు దళారులు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాలు చేశారని అన్నారు. పట్టుబడిన ముగ్గురికి బీజేపీ జాతీయ నేతలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఎమ్మెల్యేలను తీసుకువస్తే డబ్బులు, సెక్యూరిటీ, పదవులు ఇస్తామని ఆఫర్ చేశారని సిసోడియా అన్నారు. ముందు మీరు రండి బీఎల్ సంతోష్ తో మాట్లాడిన తర్వాత నెంబర్ 2తో సమావేశం ఏర్పాటు చేస్తామని చెబుతున్నారని ఆయన అన్నారు.
Read Also: Azam Khan: సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే ఆజంఖాన్‌కు షాక్.. శాసనసభ్యత్వం రద్దు
సీబీఐ, ఈడీకి భయపడకండి.. మా దగ్గర ఉంటే ఏ భయం ఉండదని హామీ ఇస్తున్నారని.. మేము ఢిల్లీలో కూడా అక్కడి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నాం అని.. 43 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారని.. ఇందుకు సంబంధించిన డబ్బులు కూడా సిద్ధం అయ్యాయని ఆడియోలో చెప్పారని.. ఆడియోలో బీఎల్ సంతోష్, అమిత్ షా పేరు కూడా చెబుతున్నారని సిసోడియా ఆరోపించారు.
ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారని.. 43 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు రూ. 1075 కోట్లు ఎక్కడివని ప్రశ్నించారు. అసలు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని.. ఎవరిదని ప్రశ్నించారు. అమిత్ షావా..? లేక బీఎల్ సంతోష్ డబ్బులా..? అని అడిగారు. కేంద్ర హోంశాఖ మంత్రి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారా..? అని ప్రశ్నించారు. ఢిల్లీ, పంజాబ్, తెలంగాణ ఇలా 8 రాష్ట్రాల్లో ఈ ప్రయత్నాలు చేస్తున్నారని.. దేశంలో ఇది తీవ్రమైన సమస్య అని అన్నారు. కేంద్రం హోంశాఖ మంత్రిని తప్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.