Manipur BJP MLAs: మణిపూర్‌లోని ఉద్రిక్తతల మధ్య అధికార బీజేపీ ప్రభుత్వంలో సంక్షోభం నెలకొంది. 19 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఈ లేఖపై సంతకం చేసిన వారిలో అసెంబ్లీ స్పీకర్ తోక్చోమ్ సత్యవ్రత్ సింగ్, మంత్రి తొంగం విశ్వజిత్ సింగ్, యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ ఉన్నారు. కాగా, మంగళవారం ఢిల్లీలో జరిగిన మైటీ, కుకీ, నాగా ఎమ్మెల్యేల సమావేశాన్ని అనుసరించి ఈ లేఖ రాశారు. అయితే, అధికార పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు బుధవారం ప్రధానికి లేఖ అందించినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వచ్చింది. శాంతి, సాధారణ స్థితిని పునరుద్ధరించడంతో పాటు పౌరుల కష్టాలను దూరం చేయడంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ సామర్థ్యాన్ని మణిపూర్ ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఆ లేఖలో ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. సత్వరమే పరిష్కారం చూపకుంటే తమ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని నియోజక వర్గీయులు కోరుతున్నారని వెల్లడించారు.
Read Also: Salman Khan Threat Case: రూ. 5 కోట్లు ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్ను చంపేస్తాం.. పోలీసులకు మెసేజ్
కాగా, బీజేపీ మద్దతుదారులు, ప్రజల నుంచి వచ్చిన ఆదేశాన్ని తాము అందుకున్నాం.. అందుకే ఈ నిర్ణయానికి వచ్చామని బీజేపీ ఎమ్మెల్యేలు తెలిపారు. మణిపూర్‌ను రక్షించడం తోపాటు రాష్ట్రంలో బీజేపీ పతనం నుంచి రక్షించడం కూడా తమ బాధ్యతగా భావిస్తున్నామని ప్రధాని రాసిన లేఖలో పేర్కొన్నారు. రెండు వర్గాల మధ్య కొనసాగుతున్న విభేదాలు, వైషమ్యాల దృష్ట్యా ప్రస్తుత ముఖ్యమంత్రిని తొలగించడమే సరైన పరిష్కారమని 19 మంది ఎమ్మెల్యేలు ఉద్ఘాటించారు. అయితే, కేవలం భద్రతా బలగాలను మోహరించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని పేర్కొన్నారు. ఈ ఘటన భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. ఇరు వర్గాల మధ్య సయోధ్య, శాంతిని పెంపొందించడానికి చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యేలు కోరారు.