Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాలో గిరిజనుల మూక ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి, హత్య చేసింది. ఈ సంఘటనలో వ్యక్తిని రక్షించేందుకు వెళ్లిన పోలీస్ బృందంపై కూడా దాడి జరిగింది. ఈ దాడిలో ఏఎస్ఐ కూడా మరణించాడు. ఈ సంఘటన శనివారం జరిగింది. హింసకు సంబంధించి ఐదుగురు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏఎస్ఐ మరణించగా, ఇతర పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయని రేవా డీఐజీ సాకేత్ పాండే తెలిపారు.
Read Also: Pakistan: పాక్ ఆర్మీని చావు దెబ్బతీసిన బీఎల్ఏ.. 90 మంది మృతి..
కొన్ని నెలల క్రితం అశోక్ కుమార్ అనే గిరిజనుడిని చంపాడనే అనుమానంతో కోల్ గిరిజన మూక సన్నీ ద్వివేది అనే వ్యక్తిని అపహరించింది. అయితే, అశోక్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. కిడ్నాప్ తర్వాత, ద్వివేదిని రక్షించడానికి షాపూర్ పోలీస్ స్టేషన్ అధికారి సందీప్ భారతీయ నేతృత్వంలో ఒక టీమ్ గాద్రా గ్రామానికి చేరుకుంది. వారు చేరుకునే సమయానికే, అతడిని ఒక గదిలో బంధించి, తీవ్రంగా కొట్టి చంపేశారు.
పోలీసులు గది తలుపు తెరిచినప్పుడు గిరిజనులు కర్రలు, రాళ్లతో వారిపై కూడా దాడి చేశారు. గాయపడిన అధికారులను ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనలో ఏఎస్ఐ చికిత్స పొందుతూ మరణించారు. జన సమూహాన్ని చెదరగొట్టడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. మరింత హింస చెలరేగకుండా ఈ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు.